ఆగని దాడులు : బంజారా హిల్స్ లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన

మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎన్నిప్రదర్శనలు జరుగుతున్నా ఇంకా ఎక్కడో ఒకచోట మగవాళ్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం జరిగిన “దిశ” ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు, చర్చలు జరుగుతూ ఉండగానే డిసెంబర్ 2, సోమవారం నాడు బంజారా హిల్స్ లో లక్ష్మి సింధూజ అనే యువతి పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.
బంజారాహిల్స్ పోలీసు స్టేసన్ పరిధిలో డిసెంబర్2, సోమవారం రాత్రి 8 గంటల సమయంలో లక్ష్మి సింధూజ పట్ల ఐదుగురు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారుతో ఢీకొట్టారు. దీంతో సింధుజ కారులో ఉన్న వారిని తనను ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నించినందుకు ఆగ్రహించిన కారులోని వ్యక్తులు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడారు. ఆ సమయంలో కారులో ముగ్గురు మహిళలు, ఇద్దరు యువకులు ఉన్నట్లు బాధితురాలు చెప్పింది.
లక్ష్మి సింధూజ సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తోంది. అయితే తనను కారుతో ఢీకొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం,డిసెంబర్3న బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.