అయ్యో పాపం.. మెడిసిన్స్ కోసం వెళ్లిన మహిళను కొండచిలువ మింగేసింది

ఇంటికి కొద్ది దూరంలోనే ఆ మహిళ కొండచిలువకు బలైపోయింది. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డకు మందులు కొనడానికి బయటకు వెళ్లిన ఆమెను పాడు పైథాన్ పొట్టన పెట్టుకుంది.

అయ్యో పాపం.. మెడిసిన్స్ కోసం వెళ్లిన మహిళను కొండచిలువ మింగేసింది

Indonesian Woman Swallowed By Python Near Home (File Photo)

Python: అనారోగ్యంతో ఉన్న తన బిడ్డకు మందులు కొనడానికి బయటకు వెళ్లిన ఓ మహిళ అనూహ్య రీతిలో చనిపోయింది. భారీ కొండచిలువ ఆమెను మింగేసింది. ఈ విషాద ఘటన సెంట్రల్ ఇండోనేసియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని సితేబా గ్రామంలోని చోటుచేసుకుంది. సిరియాటి (36) అనే మహిళ మంగళవారం ఉదయం మెడిసిన్స్ తేవడానికి వెళ్లి కనిపించడకుండా పోయింది. ఆమె భర్త అడియన్సా (30) వెతుక్కుంటూ వెళ్లగా.. తమ ఇంటికి 500 మీటర్ల దూరంలో నేలపై ఆమె చెప్పులు, ప్యాంటు కనిపించాయి.

తన భార్యకు ఏమైందన్న ఆందోళనతో ఆ ప్రాంతమంతా వెతుకుతుండగా కొద్దిదూరంలోనే అతడికి కొండచిలువ కనిపించింది. దాని పొట్ట బాగా ఉబ్బిపోయి కదల్లేని స్థితిలో ఉండడం గమనించాడు. దీంతో స్థానికుల సహాయంలో కొండచిలువ పొట్టను చీల్చి చూడగా సిరియాటి మృతదేహం బయటపడిందని ఇదుల్ అనే స్థానిక పోలీసు అధికారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా పరిగణించబడుతున్నప్పటికీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.

గత నెలలో ఇలాగే దక్షిణ సులవేసిలోని మరో జిల్లాలో కొండచిలువ ఓ మహిళను పొట్టనపెట్టుకుంది. గత సంవత్సరం ఇదే ప్రావిన్స్‌లో ఓ రైతును ఊపిరాకుండా చేసి చంపేయడంతో స్థానికులు 8 మీటర్ల కొండచిలువను మట్టుబెట్టారు. 2018లో ఆగ్నేయ సులవేసిలోని మునా పట్టణంలో 54 ఏళ్ల మహిళను ఏడు మీటర్ల కొండచిలువ మింగేసింది. అంతకు ముందు సంవత్సరం పశ్చిమ సులవేసిలో ఒక రైతును పామాయిల్ తోటలో నాలుగు మీటర్ల కొండచిలువ మింగేసింది.

Also Read : హత్రాస్ ఘోర విషాదం.. ఎవరీ బోలే బాబా? ఏం చేస్తాడు? ఎలా పాపులర్ అయ్యాడు?