నగ్నఫోటోలు పంపమని బెదిరించిన యువకుడి అరెస్ట్

సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ వల్ల సద్వినియోగం కంటే దుర్వినియోగమే ఎక్కువ జరుగతున్నట్లు కనిపిస్తోంది. కొందరు అకాతాయిలు చేసే పనులతో యువతులు మహిళలు ఇబ్బందుల పాలవుతున్నారు. పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఒక యువతి నగ్న ఫోటోలు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తానని బెదిరించిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ బహుదూర్ పురా హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శుభమ్ యాదవ్ అనే యువకుడు ఇంటర్మీడియెట్ వరకు చదివి ప్రస్తుతం పాన్ షాపులో పని చేస్తున్నాడు. చదువుకునే సమయంలో ఒక యువతితో సన్నిహితంగా తిరిగేవాడు. ఆ సమయంలో ఆమెతో తీసుకున్న ఫోటోలు దాచి పెట్టుకున్నాడు.
ఇటీవల ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడీ ద్వారా ఆ యువతికి పంపించి… తనకు నగ్నంగా ఉన్న ఫోటోలు పంపాలని బెదిరించాడు. లేకపోతే ఈ ఫోటోలనే మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ యువతి తన సోదరి బట్టలు మార్చుకుంటుండగా ఫోటోలు తీసి అతనికి పంపించింది.
అది అవకాశంగా తీసుకుని శుభమ్ యాదవ్ మరిన్ని ఫోటోలు పంపించాలని వేధించటం మొదలెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేని యువతి విషయాన్ని తల్లి తండ్రులకు చెప్పింది. దీంతో వారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం శుభమ్ యాదవ్ ను అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 255/2020 u/s 354D, 506 ,12 మరియు పోక్సో చట్టం 66C & 67A కింద కేసులు నమోదు చేసారు.
Read Here>>మేడ్చల్ చిన్నారి ఆద్యహత్య కేసులో నిందితుడికి 14 రోజులు రిమాండ్…