ఉచ్చు బిగుస్తోంది : హీరా గ్రూప్ కేసు

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 04:11 PM IST
ఉచ్చు బిగుస్తోంది : హీరా గ్రూప్ కేసు

Updated On : April 13, 2019 / 4:11 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గ్రూప్ కేసుపై ఉచ్చు బిగుసుకుంటోంది. ఓవైపు అన్ని రాష్ట్రాలలో హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌పై కేసులన్నీ పెండింగ్‌లో ఉండటంతో… ఈడీ అధికారులు ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ హీరా గ్రూప్ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. 

హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్‌ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని.. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కోరుతూ హీరా గ్రూప్ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను వచ్చే సోమవారం హైకోర్టు విచారించనుంది. ఇటు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు దర్యాప్తులో వెల్లడి కావడంతో.. సీసీఎస్ పోలీసులు ఈడీ అధికారులకు లేఖను రాసారు. లేఖపై స్పందించిన ఈడీ అధికారులు… హీరా గ్రూప్ కేసుపై విచారణ ప్రారంభించారు. 

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులలో భాగంగా నౌహీరాను ఆయా రాష్ట్రాల పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక జైల్లో ఉన్న నౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఈడీ సిద్ధం అవుతుంది. అయితే సీబీఐ చేత విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని హీరా గ్రూప్ బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక కేసులు నమోదైనా బాధితులకు మాత్రం ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆరోపించారు. 

హీరా గ్రూప్‌ దేశ వ్యాప్తంగా 5కోట్ల 64వేలకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. దీనికి తోడు ఆరు లక్షల అమెరికన్ డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిర్హమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్‌ దీనార్స్‌ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.

ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఖాతాలు ఫ్రీజ్‌ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం 25 కోట్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం 300 కోట్లు ఉన్నట్లు తేలింది. దీనికి తోడు ఇప్పటి వరకు మరో 10 వేల మందికి దాదాపు 350 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మిస్టరీని  బయటపెట్టడానికి ప్రస్తుతం ఈడీ అధికారులు దృష్టిపెట్టారు.  

మొత్తంమీద వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన హీరా గ్రూప్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో నమోదైన కేసులన్నీ ఇప్పటికే పెండింగ్‌లో ఉండటంతో ఇప్పుడు ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వస్తాయా, ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరుగుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు  హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలి చేస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.