జయరాం హత్య కేసులో కీలక మలుపు : పీఎస్ నుంచి శ్రిఖా తరలింపు

విజయవాడ : పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జయరాం హత్య కేసులో అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. కంచికచర్ల పీఎస్ నుంచి శ్రిఖా చౌదరిని పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. అర్ధరాత్రి 1.10 గంటల సమయంలో వీధి లైట్లు ఆఫ్ చేసి శ్రిఖా చౌదరిని కారులో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని ఓ రహస్య ప్రాంతంలో శ్రిఖా చౌదరిని ఉంచారు. అయితే శ్రిఖా చౌదరిని హైదరాబాద్ కు ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై స్పష్టత కొరవడింది. కాసేపట్లో మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి రానున్నారు. జయరాం హత్య కేసులో శ్రిఖా చౌదరిని అరెస్టు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే.
జయరాం హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో జయరాం మేనకోడలు శ్రిఖా చౌదరి సంచలన విషయాలు బయటపెట్టింది. తనకు జయరాంకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. రాకేష్ రెడ్డితో డేటింగ్ చేశానని అంగీకరించింది. రాకేష్‌రెడ్డి జయరాంకు నాలుగున్నర కోట్లు అప్పుగా ఇచ్చాడని అవి తిరిగి ఇవ్వక పోవడంతో.. రాకేష్ తమపై కోపం పెంచుకున్నాడని తెలిపింది. రాకేష్‌తో గొడవలు జరుగుతున్నప్పుడే శ్రీకాంత్ పరిచయం అయ్యాడని శ్రిఖా తెలిపింది.