భార్యాభర్తల ప్రాణం తీసిన హృతిక్ రోషన్‌పై అభిమానం

అభిమానం ఉండాలి కానీ, అవధులు దాటకూడదు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను భర్తలో చూసుకోవాలని భర్తపై ఒత్తిడి పెంచడంతో అది కాస్తా ఆమె ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా న్యూయార్క్‌లో ఉంటున్న దినేశ్వర్, డోజోయ్‌లు భార్య భర్తలు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా భర్త దినేశ్వర్ విధులు నిర్వహిస్తుండగా, భార్య డోజోయ్ బార్‌లో ఉద్యోగం చేస్తోంది.
ఈ క్రమంలో భార్యకి హృతిక్ రోషన్ అంటే పెళ్లికి ముందునుంచే చాలా ఇష్టం. ఆ అభిమానం అవధులు దాటి భర్తను హృతిక్ రోషన్‌లాగే ఉండాలని సతాయించేంతలా మారింది. 24గంటలూ ఏం చేసినా హృతిక్‌లానే ఉండాలి. కండలు పెంచాలంటూ భర్తకు చిరాకు తెప్పించింది. భార్య నోటి నుంచి హృతిక్ రోషన్ పేరు జపిస్తుండటంతో అసూయ పెంచుకున్నాడు.
తరచూ ఈ విషయంలో గొడవపడుతూ.. భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో డోజోయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దినేశ్వర్ పై నాలుగురోజుల శిక్ష విధించారు. జైలు జీవితం భార్య వల్లనేనని కుమిలిపోయాడు. శిక్ష పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లి భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. భార్య సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పి తాళం చెవి పూలకుండి దగ్గర పెట్టానని చెప్పి వెళ్లిపోయాడు. ఇంటికి దగ్గర్లోని పొలాల్లో ఓ చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.