మోడల్ జెసికా లాల్ హత్య కేసు దోషి విడుదల

1999లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్ జెసికా లాల్ హత్య కేసులో దోషిగా తేలిన మాజీ కేంద్రమంత్రి వినోద్ శర్మ కుమారుడైన మను శర్మ అలియాస్ సిద్ధార్థ్ వశిష్ట తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. 14సంవత్సారాల జైలు శిక్ష తర్వాత “సత్ ప్రవర్తన” కింద మను శర్మ సోమవారం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యాడు.
ఢిల్లీ హోంమంత్రి,జైళ్ల డీజీ,ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం),ప్రిన్సిపల్ సెక్రటరీ(లా),జాయింట్ సీపీ(క్రైమ్),చీఫ్ ప్రొబేషన్ ఆఫీసర్(ఢిల్లీ ప్రభుత్వం)మరియు జిల్లా జడ్జితో కూడిన శిక్షాకాల పునః సమీక్ష బోర్డు(సెంటెన్స్ రివ్యూ బోర్డు) సిఫార్సు మేరకు వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో మను శర్మతో పాటుగా మరో 18 మంది సోమవారం విడుదలయ్యారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పెరోల్ మీద బయట ఉన్న మను శర్మకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పూర్తిస్థాయిలో జైలు నుంచి విముక్తి లభించింది.
ఓ ప్రైవేటు బార్‌లో పనిచేస్తున్న జెసికా లాల్‌ను 1999 ఏప్రిల్-30న మను శర్మ అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. సమయం మించిపోయిన కారణంగా తనకు మద్యం సర్వ్ చేసేందుకు జెసికా నిరాకరించడంతో.. ఆమెను పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో ఢిల్లీ హైకోర్టు మను శర్మకి 2006లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2010లో దిగువ కోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. ఇక గత రెండేళ్లుగా సత్ప్రవర్తనతో మెలుగుతున్న కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు జైలు నుంచి బయటకు వెళ్లి పని చేసేందుకు మను శర్మకు అవకాశం లభించింది. దీంతో ఖైదీల పునరావాస కేంద్రంలో అతడు పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మనుశర్మలో మార్పు వచ్చిందని భావించిన జెసికా సోదరి సబ్రినా లాల్ అతడిని విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని 2018లో జైళ్ల శాఖకు లేఖ రాశారు. ఈ క్రమంలో ముందస్తుగా తనను విడుదల చేయాలంటూ రెండేళ్ల క్రితం అతడు చేసిన అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. అత్యంత హేయమైన నేరాల్లో భాగమైన మనుశర్మకు ఈ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇక అనేక పరిణామాల అనంతరం ఇప్పుడు మూడేళ్ల ముందుగానే విడుదలయ్యాడు.
Read: 13ఏళ్ల కూతుర్ని నరబలి ఇచ్చిన పన్నీర్ సెల్వం..!తమిళనాడులో దారుణం