మేకను ఈడ్చుకెళ్లి తినేసిన చిరుత పులి
రంగారెడ్డి : చిరుత పులి ఆ గ్రామ ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. పులి భయంతో గజగజ వణకుతున్నారు. వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఎప్పుడు..ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అనునిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. యాచారం మండలంలో మరోసారి చిరుత కలకలం రేపింది. కొత్తపల్లి తండాలో పశువుల మందపై దాడి చేసింది. మందలోని మేకను ఈడ్చుకెళ్లి తినేసింది.
వారం రోజుల్లో 4 మేకలను చంపింది. తాజాగా రాత్రి మరో మేకను చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. చిరుత కదలికలను కనిపెట్టేందుకు అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు బోన్లను ఏర్పాటు చేశారు. మేకల వైపు వస్తున్న ఎంట్రీలో ఒక బోను, అడవి వైపు వెళ్తున్న దారిలో మరో బోను ఏర్పాటు చేశారు.