Kadapa Love Incident : కడప జిల్లాలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం..

పరారీలో ఉన్న ప్రేమోన్మాది కుళ్లాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Kadapa Love Incident : కడప జిల్లాలో దారుణం.. యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం..

Updated On : December 8, 2024 / 12:11 AM IST

Kadapa Love Incident : కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో కుళ్లాయప్ప వేధిస్తున్నాడు. యువతి నిరాకరించంతో కుళ్లాయప్ప బరితెగించాడు. ఇంట్లోనే ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం యువకుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రేమోన్మాది కుళ్లాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమోన్మాది దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని తొలుత పులివెందులలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో యువతిని తిరుపతికి తరలిస్తున్నారు. యువతీ, యువకుడి మధ్య రెండు మూడేళ్లుగా ప్రేమ వ్యవహారంపై గొడవ నడుస్తున్నట్లు సమాచారం.

ప్రతిసారి యువతి అతడి ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. నిన్న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమోన్మాది కుళ్లాయప్ప నేరుగా యువతి ఇంటికి వెళ్లాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. దాదాపు 13 నుంచి 15 సార్లు కత్తితో కిరాతకంగా యువతిని పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయింది.

ఆ తర్వాత కుళ్లాయప్ప అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రేమోన్మాది ఆ సమయాన్నే ఎంచుకోవడం చూస్తుంటే పక్కా ప్లానింగ్ తో దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాయంత్రం సమయంలో యువతి ఇంట్లో ఎవరూ ఉండరని ప్రేమోన్మాది తెలుసుకున్నాడు. యువతి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు.

సాయంత్రం ఇంకా ఇంటికి వచ్చి ఉండరని పసిగట్టిన ప్రేమోన్మాది.. ఆ సమయాన్ని చూసుకుని నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పరారీలో ఉన్న ప్రేమోన్మాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కుళ్లాయప్ప గురించి సమాచారం సేకరిస్తున్నారు. కుళ్లాయప్ప కూలి పనులు చేస్తుంటాడని, ఆకతాయిగా తిరుగుతుంటాడని పోలీసుల విచారణలో తెలిసింది.

Also Read : సడెన్‌గా పవన్ కల్యాణ్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు.. కారణం అదేనా?