ఖరీదు రూ.60వేలు : చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు

  • Published By: sreehari ,Published On : November 18, 2019 / 01:57 PM IST
ఖరీదు రూ.60వేలు : చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు

Updated On : November 18, 2019 / 1:57 PM IST

పోలీసులకు ఓ వింత కేసు వచ్చింది. చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అబ్దుల్ హఫీజ్ అనే వ్యాపారవేత్త తన ఇంట్లో 10 జతల ఖరీదైన షూస్ దొంగతనం జరిగిందని కంప్లయింట్ చేశాడు. వీటి విలువ రూ.60వేలు వరకు ఉంటుందని వాపోయాడు. తన ఇంటి వసారాలో పెట్టిన బూట్లను ఎవరో ఎత్తుకెళ్లారని, బ్రాండెడ్ షూస్ అంటూ లబోదిబోమన్నాడు. 

ఈ ఘటన చెన్నైలోని కిలపాక్ ప్రాంతంలోని దివాన్ బహుదుర్ షణ్ముగం వీధిలో జరిగింది. బాధితుడు దగ్గరలోని సెక్రటేరియేట్ పోలీసు స్టేషన్ కు వెళ్లి బూట్ల దొంగతనం జరిగినట్టు చెప్పాడు. శనివారం (నవంబర్ 16, 2019) ఉదయం తాను ఇంట్లోనే ఉన్నానని, ఇంటి ప్రధాన ద్వారం కూడా లాక్ వేసినట్టు పోలీసులకు వివరించాడు. గంట తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా చెప్పులు మాయమయ్యాయని అన్నాడు. 

అందులో బూట్లతో పాటు శాండిల్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. తన పక్కంటివారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం ఉందని అన్నాడు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ఇంకా చేపట్టలేదు. ఇంట్లోకి వచ్చి వెళ్లిన పక్కంటివారిని పోలీసులు ముందుగా ప్రశ్నించాలని భావిస్తున్నారు. బాధితుడి ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్టు తెలిపారు.