Phone Explode: బాబోయ్.. బాంబుల్లా పేలుతున్న ఫోన్లు.. బీకేర్ ఫుల్.. యువకుడి ప్యాంటు జేబులో పేలిన ఫోన్
ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ బాంబులా పేలిపోయిన ఘటన కలకలం రేపింది.

Phone Explode: ఫోన్.. ప్రస్తుతం మన జీవితంలో ఓ భాగమైపోయింది. చిన్న, పెద్ద.. పేద, ధనిక అనే తేడా లేదు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జనాలకు ఇప్పుడిది నిత్యవసర వస్తువులా మారిపోయింది. మొబైల్ ఫోన్ లేకుండా కొంతమంది ఒక్క సెకను కూడా ఉండలేకపోతున్నారు. తిండి, నీళ్లు లేకపోయినా పర్లేదు కానీ ఫోన్ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు. అంతగా కొందరు ఫోన్ కు బానిసలుగా మారారు. అయితే, ఇటీవలి కాలంలో ఫోన్లు పేలిపోతున్న ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం ఎక్కడో ఒక చోట ఫోన్ పేలిపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ హైవేపై జరిగింది. గంగాధర్ అనే యువకుడు బైక్ పై వెళ్తున్నాడు. అతడి ప్యాంట్ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతడికి గాయాలయ్యాయి. తొడ పైభాగంలో చర్మం కాలిపోయింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్యాంట్ జేబులో ఉన్న ఫోన్ బాంబులా పేలిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? ఫోన్ ఎందుకు పేలింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఫోన్ వాడే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడటం, ఎక్కువగా చూడటం తగ్గించుకోవాలి. ఓవర్ గా ఛార్జింగ్ చేసినా పేలిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ ఛార్జర్లు వాడకపోయినా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది.