పెళ్లైన వారానికే నవ వధువు ఆత్మహత్య

వంద అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు అనే మాట పూర్వకాలం వాడుకలో ఉండేది. రానురాను అది పెద్ద నేరం అయ్యింది. చాలా మంది అబద్దాలు చెప్పి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాటివల్ల కాపురాలు విఛ్ఛిన్నమై పోవటం.. విడాకులకు దారితీసి కుటుంబాలు దారుణంగా దెబ్బతిన్న వార్తలు చాలా చూశాం.
ఇక్కడా అదే జరిగింది. తమకు బోలెడన్ని ఆస్తులున్నాయని… అబ్బాయికి విదేశాల్లో ఉద్యోగమని అబద్దాలు చెప్పి లక్షల రూపాయలు కట్నం తీసుకుని మోసం చేశాడు ఒక ప్రబుధ్దుడు. పెళ్లైన వారం రోజులకే జరిగిన మోసం తెలిసి…. అది తట్టుకోలేని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
కోదాడ పట్టణంలో నివాసం ఉండే ఉపాధ్యాయుడు సామా ఇంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మౌనికా రెడ్డి(25) కి హైదరాబాద్ ఈసీఐఎల్ కు చెందిన బద్దం శ్రీనివాస రెడ్డి కుమారుడు సాయికిరణ్ రెడ్డితో మార్చి15, 2020న సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాలులో వైభవంగా వివాహం జరిగింది. వివాహ సమయంలో సాయికిరణ్ రెడ్డికి కట్న కానుకల కింద ఇంద్రారెడ్డి కుటుంబం రూ.10లక్షల నగదు, 35 తులాల బంగారం, 4 కిలోల వెండి ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత మౌనికా రెడ్డి హైదరాబాద్ లో అత్తవారింటికి వచ్చింది.
వివాహానంతరం అత్తారింటికెళ్లిన కూతుర్ని, అల్లుడ్ని ఉగాది పండుగకు పిలిచేందుకు ఇంద్రారెడ్డి భార్య మంజుల, స్నేహితుడు గడ్డం మాధవరెడ్డితో కలిసి మార్చి21న హైదరాబాద్ లోని అల్లుడింటికి వెళ్లాడు. అప్పటికే కూతురు ద్వారా అల్లుడి ఉద్యోగం, ఆస్తుల విషయం తెలుసుకున్న ఇంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్లిన తర్వాత వరుడి కుటుంబ సభ్యులను వాటి గురించి ప్రశ్నించాడు.
దీంతో కోపోద్రిక్తులైన సాయికిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంద్రారెడ్డిని భార్య మంజులను తీవ్రంగా దూషించారు. అనంతంరం ఇంద్రారెడ్డి దంపతులు తమ కుమార్తెనుతీసుకుని కోదాడ లోని తమ ఇంటికి వెళ్ళిపోయారు.
అదే రోజు రాత్రి భోజనాల సమయంలో కుమార్తె మౌనికా రెడ్డి తల్లితండ్రులను పట్టుకుని మోస పోయాం నాన్నా అని రోదించింది. అప్పటికి భోజనాలు పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులు నిద్రపోయారు. మరునాడు ఉదయం లేచి మౌనికా రెడ్డిని నిద్ర లేపటానికి ఆమె పడుకున్న గది తలుపులు కుటుంబ సభ్యులు కొట్టగా అవి తెరుచుకోలేదు.
కొద్దిసేపు ప్రయత్నించిన అనంతరం కిటికీలోంచి చూడగా ఆమె చీరతో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు తెరిచి ఆమెను కిందకు దించగా అప్పటికే ఆమె మరణించింది. భర్తకు ఉద్యోగంలేదు…ఆస్తి పాస్తులు లేవు తాము మోసపోయామని ఆమెరాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.