జయరాం కేసు : నిజం ఒప్పేసుకున్న రాకేష్

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 06:29 AM IST
జయరాం కేసు : నిజం ఒప్పేసుకున్న రాకేష్

Updated On : February 15, 2019 / 6:29 AM IST

జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్‌లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడించాడు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని తెలంగాణ పోలీసులు విచారించింది. హత్యలో శ్రిఖా ప్రమేయం ఉందా ? లేదా ? తెలుసుకొనేందుకు ఆమెను కూడా విచారించారు. ఫిబ్రవరి 16వ తేదీ శనివారం మీడియా ఎదుట జయరాం హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.

జయరాం చనిపోతే ఆస్తులు తనకు వచ్చే విధంగా పక్కా ప్లాన్ వేయడం…చంపేసేముందు బాండ్ పేపర్ల మీద జయరాం చేత బలవంతంగా సంతకాలు…హత్యకు వారం రోజుల ముందే స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో రాకేష్ చెప్పినట్లు తెలుస్తోంది. హత్య విషయాన్ని నలుగురికి చెప్పడం…ఆ సమయంలో ఆ నలుగురూ అక్కడే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ వీణా మేడమ్ డ్రైవర్‌ని అంటూ జయరాంని కారులో నటుడు సూర్య ఎక్కించుకొచ్చాడని సమాచారం. నటుడు సూర్య ‘ఆ నలుగురు’ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా నటించాడు. ఇతడిని పోలీసులు విచారించారు. రాకేష్ రెడ్డితో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చిన ఈ నటుడు జయారాం హత్యకు…తనకు సంబంధం లేదని సూర్య పేర్కొన్నాడు. మరి పోలీసులు ఎలాంటి విషయాలు చెప్పనున్నారు ? జయరాంను చంపింది ఎవరు ? హత్య సమయంలో ఉన్న ఆ నలుగురు ఎవరు ? శ్రిఖా చౌదరి పాత్ర ఉందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది.