Himayat Nagar Robbery Case : హిమాయత్‌నగర్ వ్యాపారి ఇంట్లో రూ.3 కోట్ల చోరీ కేసు.. దొంగలు ఎవరో తెలిసి అంతా షాక్.. వెన్నులో వణుకు పుట్టించే విషయాలు చెప్పిన పోలీసులు..
ఈ కేసుని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీని జల్లెడ పట్టారు.

Himayat Nagar Robbery Case : హైదరాబాద్ హిమాయత్‌నగర్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని చేధించారు పోలీసులు. 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసింది ఎవరో తెలిసి పోలీసులతో పాటు వ్యాపారి కూడా షాక్ కి గురయ్యారు. తన కూతురు పెళ్లి పనుల్లో సాయంగా ఉంటారని పనికి పిలిపించిన వ్యక్తులే ఈ భారీ చోరీ చేసినట్లు తెలుసుకుని ఆ వ్యాపారి కంగుతిన్నాడు.
రెండు రోజుల క్రితం నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రముఖ ఆయిల్ వ్యాపారి రోహిత్ కేడియా ఇంట్లో భారీ చోరీ జరిగింది. కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు, నగదు చోరీ అయ్యాయి. ఈ భారీ దొంగతనం సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే చేధించారు. కేసు వివరాలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
కేడియా గ్రూప్ సంస్థ అధినేత రోహిత్ కేడియా హిమాయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇందులో భాగంగా 5 రోజుల క్రితం వ్యాపారి, ఆయన కుటుంబసభ్యులు దుబాయ్ వెళ్లారు. ఈ నెల 11వ తేదీన రోహిత్ కేడియా సంస్థలో పని చేస్తున్న వ్యక్తి తన యజమాని ఇంటికి వెళ్లాడు. అక్కడ తాళాలు పగలగొట్టి ఉండటం చూసి షాక్ తిన్నాడు. కంగారుగా లోపలికి వెళ్లి చూసి విస్తుపోయాడు.
Also Read : అయ్యో పాపం.. చావుతో పోరాడుతున్న రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన యువకుడు.. అసలేం జరిగిందంటే..
అల్మారా ఓపెన్ చేసి ఉంది. అందులో ఉండాల్సిన ఖరీదైన బంగారు ఆభరణాలు, క్యాష్ కనిపించలేదు. ఆందోళనకు గురైన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. సుమారు రూ.3 కోట్ల విలువైన సొత్తు మాయమైందని విచారణలో తెలిసింది.
ఈ కేసుని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో దొంగలు ఎవరో తెలిసిపోయింది. చోరీకి పాల్పడింది.. ఇంట్లో పని మనుషులే అని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. పెళ్లి పనుల్లో సాయంగా ఉంటారని పిలిస్తే.. ఏకంగా ఆ ఇంట్లోనే చోరీకి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు బీహార్ వాసులు. ఒకరు వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు.
”నిందితుల్లో సుశీల్ ముఖియా (29) అనే వ్యక్తి వ్యాపారి ఇంట్లో రెండేళ్లు పని చేశాడు. తర్వాత బీహార్ లోని తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అయితే, ఇది వరకే అతడు తన దగ్గర పని చేశాడనే ఉద్దేశంతో కూతురి పెళ్లి పనుల్లో సాయంగా ఉంటాడని సుశీల్ ముఖియాను వ్యాపారి హైదరాబాద్ కి పిలిపించారు. 15 రోజుల క్రితమే ముఖియా ఇక్కడికి వచ్చాడు. వ్యాపారి, ఆయన కుటుంబసభ్యులు దుబాయ్ వెళ్లడం చూసి చోరీకి స్కెచ్ వేశాడు. తన దగ్గర పని చేసిన మోల్హూ ముఖియాను ఢిల్లీ నుంచి పిలిపించాడు సుశీల్ ముఖియా. కోల్ కతాకు చెందిన బసంతితో కలిసి చోరీకి పాల్పడ్డారు” అని పోలీసులు వెల్లడించారు.
”సుశీల్ ముఖియా, మోల్హూ ముఖియా ఇద్దరిదీ బీహార్. వీరిద్దరూ ఇదివరకే వ్యాపారి ఇంట్లో పని చేశారు. ఇది వరకే తన దగ్గర పని చేశారనే నమ్మకంతోనే వ్యాపారి వారిని తిరిగి పనిలో పెట్టుకున్నారు. వారిని నమ్మి ఇంటిని అప్పజెప్పి దుబాయ్ వెళ్లారు. ఇదే అదనుగా పథకం ప్రకారం ప్లాన్ వేసి చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ని వ్యాపారికి పంపించాం. అందులో ఉన్న వ్యక్తిని ఆయన గుర్తించారు. ఇతడు మా ఇంట్లో పని చేసే వాడని చెప్పారు. అలా మేము సీసీటీవీలన్నీ ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్లాం.
దొంగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లు మాకు తెలిసింది. వెంటనే మూడు టీమ్స్ ని పంపాం. ఒకటి భోపాల్, మరొకటి నాగ్ పూర్, ఇంకొకటి పాట్నా పంపాం. నాగ్ పూర్ లో రైలులోని ప్రతి కోచ్ ను చెక్ చేశారు. ముగ్గురు దొంగలు ఒకే కోచ్ లో ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని చెక్ చేయగా సొమ్ము బయటపడింది.
వెంటనే వీడియో కాల్ చేసి వ్యాపారికి చూపించాం. వాళ్లు గుర్తించారు. వాళ్లు మా ఇంట్లో పని చేసే వారని చెప్పారు. ఆ ప్రాపర్టీని కూడా గుర్తించారు. 1.42 కిలోల బంగారం, డైమండ్స్ (710 గ్రాములు), 3,300 క్యారెట్లు (ఒక్కో క్యారెట్ విలువ 1.12లక్షలు), ఫారిన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ.. అంతా కలిసి 5 కోట్ల విలువ ఉంటుంది.
బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా బీరౌల్ గ్రామస్తులు. ఇక్కడ ముఖియా అనే కమ్యూనిటీ ఉంది. ఆ ముఖియాకు చెందిన వారే ఎక్కువ శాతం ఉంటారు. వీరంతా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించారు. ఇళ్లలో పని వాళ్లుగా చేరతారు. అదను చూసి పని చేసే ఇంట్లోనే చోరీలకు పాల్పడతారు. నేరం చేసిన తర్వాత ఇంటికి వెళ్లరు. వారికి ఒక నెట్ వర్క్ ఉంటుంది.
Also Read : ఓ మై గాడ్.. పెళ్లికి వచ్చిన అనుకోని అతిథి, ఒక్కసారిగా హాహాకారాలు, ప్రాణభయంతో పరుగులు తీసిన గెస్టులు..
వీరికి టెక్నాలజీ మీద మంచి అవగాహన ఉంది. ఫోన్ అస్సలు వాడరు. ఒకసారి ఎస్కేప్ అయితే ఇక దొరకరు. హిమాయత్ నగర్ వ్యాపారి కేసులో దొంగలు ట్రైన్ లో ఈజీగా దొరికేశారు. చోరీ చేసిన తర్వాత ముఠా సభ్యులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. అక్కడి ఉండి అంతా కూల్ అయ్యాక స్వగ్రామాలకు వెళ్తారు. సుశీల్ ముఖియా మోల్హూ ముఖియాను తీసుకొచ్చి వ్యాపారి ఇంట్లో పనికి పెట్టాడు.
అయితే, ఓ మర్డర్ కేసులో మోల్హూ ముఖియా నిందితుడు. ఈ విషయం వ్యాపారికి కూడా తెలీదు. అలా వారు తమ నెట్ వర్క్ ని మెయింటైన్ చేస్తారు. ముందుగానే నేరం చేయాలనే ఆలోచనతో వీరంతా ఒక చోటు చేరతారు. పాత నేరస్తుడిని తోడుగా తీసుకొచ్చి పెట్టడం.. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. ఆ ఇంట్లో పక్కా ప్లాన్ ప్రకారమే చోరీకి పాల్పడ్డారు. ఒకవేళ ఎవరైనా అడ్డు వస్తే వారిని చంపడానికి కూడా వెనుకాడరు. చాలా డేంజరస్ క్రిమినల్స్ వీళ్లు” అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.