Child Marriage: ఘోరం.. 40 ఏళ్ల వ్యక్తితో 13 ఏళ్ల బాలికకు వివాహం.. స్కూల్ టీచర్ల ద్వారా బయటపడిన దారుణం..
బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను చదువుకుంటానని చెప్పింది.

Child Marriage: బాల్య వివాహాలు చట్టరిత్యా నేరం. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలా చేయడం తప్పు అని చెబుతున్నాయి. అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు పోలీసులు. దీనిపై అవగాహన కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట బాల్య వివాహాల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉండటం ఆందోళనకు గురి చేసే అంశం.
తాజాగా రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వ్యక్తితో 13 ఏళ్ల బాలికకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి విషయాన్ని బాలిక తాను చదువుకునే స్కూల్ టీచర్లకు తెలిపింది. వెంటనే టీచర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లితోపాటు వివాహం చేసుకున్న శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు, మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బాలికను ఐసీడీఎస్ అధికారుల సహకారంతో సఖీ కేంద్రానికి తరలించారు పోలీసులు.
నందిగామకు చెందిన మహిళకు కూతురు, కొడుకు ఉన్నారు. భర్త చనిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఆమె కూతురు ప్రభుత్వ బడిలో 8వ తరగతి చదువుతోంది. కుటుంబ పోషణ భారంగా మారడంతో కూతురికి పెళ్లి చేసేందుకు మధ్యవర్తిని సంప్రదించింది. అతను ఓ సంబంధం తీసుకొచ్చాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందివాడకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ కి ఆస్తి బాగా ఉందని చెప్పాడు. దీంతో తన కూతురిని అతడికిచ్చి పెళ్లి చేసేందుకు ఆమె అంగీకరించింది. మే 28న బాలికను శ్రీనివాస్ కి ఇచ్చి వివాహం జరిపించారు.
అయితే, బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తాను చదువుకుంటానని చెప్పింది. ఆస్తిపరుడు అని చెప్పి తన తల్లి ఇష్టం లేని పెళ్లి చేసిందని వాపోయింది. ఈ విషయాన్ని తన స్కూల్ టీచర్లకు తెలిపింది. వెంటనే టీచర్లు నందిగామ తహసీల్దార్ దగ్గరికి వెళ్లారు. విషయాన్ని ఆయనకు తెలియజేశారు. తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదుతో ఆమె తల్లితో పాటు పెళ్లి కొడుకు, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
”శ్రీనివాస్ గౌడ్ బాలికతో దాదాపు రెండు నెలలుగా కలిసి ఉన్నాడు. బాలికతో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తేలితే శ్రీనివాస్ గౌడ్ పై పోక్సో కింద కేసు నమోదు చేస్తాం” అని పోలీసులు తెలిపారు. మైనర్‌తో లైంగిక సంబంధాలు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆచారాన్ని ఆపడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో బాల్య వివాహాలు కొనసాగుతున్న సమస్యను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది.
మన దేశంలో బాల్య వివాహాలు నిషేధం. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం.. బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు నిండకుండా జరిగే ఏ వివాహమైనా బాల్య వివాహంగా పరిగణిస్తారు. 18 ఏళ్ల వయసు దాటిన పురుషుడు 18 ఏళ్లలోపు బాలికను వివాహం చేసుకుంటే.. అతనికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించొచ్చు. బాల్య వివాహం చేసినా, కుదిర్చినా, ప్రోత్సహించినా తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, మధ్యవర్తులు, వివాహానికి సహకరించిన వారంతా శిక్షార్హులే. వీరికి కూడా రెండేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించొచ్చు.