పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిళ్లు : సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య
నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
నల్లగొండ : జిల్లాలో విషాదం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిళ్లు రావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెంలో శివకృష్ణ అనే వ్యక్తి తన భార్య మౌనికను సర్పంచ్ పదవికి బరిలో నిలిపారు. ప్రధాన పార్టీకి రెబల్ అభ్యర్థిగా భార్యను పోటీకి నిలిపారు. ఈనేపథ్యంలో పోటీ నుంచి తప్పుకోవాలని ప్రధాన పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. అయినా మౌనిక సర్పంచ్ బరి నుంచి తప్పుకోలేదు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే వరకు విత్ డ్రా చేసుకోకపోవడంతో ప్రధాన పార్టీకి చెందిన నేతలు శివకృష్ణపై బెదిరింపులకు పాల్పడ్డారు. బెదిరింపులు, ఒత్తిళ్లను తట్టుకోలేక శివకృష్ణ జనవరి 23 రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడటం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివకృష్ణను కొట్టడం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని మరికొంతమంది ఆరోపిస్తున్నారు. శివకృష్ణ హత్యకు కారమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.