రూ.5వేలు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ను రూ.30వేలకు అమ్మకం, హైదరాబాద్‌లో కరోనా డ్రగ్స్ దందా

కరోనా కాలాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డంగా జనాలను దోచుకుంటున్నారు. డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో కరోనా డ్రగ్స్ తో దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి అధిక ధరకు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్ గిరి లో ఎస్వోటీ పోలీసులు సోమవారం(జూలై 20,2020) అరెస్ట్ చేశారు. ఫెవిఫిరావిర్ ట్యాబ్లెట్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను రూ.30వేల చొప్పున ఎక్కవ ధరకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. మార్కెట్ లో రెమ్ డెసివిర్ ఒక్క ఇంజెక్షన్ ధర రూ.5వేల 500 మాత్రమే. నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వారి నుంచి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.
కరోనా చికిత్సలో ఫెవిఫిరావిర్ ట్యాబ్లెట్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు వాడుతున్నారు. దీంతో వాటికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారు. కృతమ కొరత సృష్టించి కరోనా యాంటీ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. మరో దారి లేకపోవడంతో కొందరు వ్యక్తులు వారి చెప్పిన ధరకే కొంటున్నారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జోరుగా ఆక్సిజన్ సిలిండర్ల దండా నడుస్తోంది. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కృతిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. పోలీసులు ఎంత నిఘా పెంచినా, అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు.