తల్లిని చంపి ప్రియుడితో పోర్టుబ్లెయిర్ చెక్కేసిన టెక్కీ

  • Published By: chvmurthy ,Published On : February 6, 2020 / 02:53 PM IST
తల్లిని చంపి ప్రియుడితో పోర్టుబ్లెయిర్ చెక్కేసిన టెక్కీ

Updated On : February 6, 2020 / 2:53 PM IST

నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసింది ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తల్లిని హత్యచేస్తుండగా అడ్డు వచ్చిన అన్నను తీవ్రంగా గాయపరిచి ప్రియుడితో కలిసి అండమాన్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయింది. ఫిబ్రవరి 2న బెంగుళూరులో ఈ ఘటన జరుగగా నిందితులను పోలీసులు పోర్టుబ్లెయిర్ లో అరెస్టు చేసి తీసుకువచ్చారు.

బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే సి.అమృత(33) 2017 వరకు ఆఫీసుకు వెళ్లి పనిచేసేది. 2017 నుంచి కుటుంబ సమస్యల కారణంగా ఇంటివద్ద(వర్క్ ఫ్రం హోం) నుంచి పనిచేస్తోంది. తండ్రి ఊపిరి తిత్తుల క్యాన్సర్ కారణంగా ఆయనకు ఆస్పత్రి ఖర్చుల కోసం చేసిన రూ.4 లక్షల అప్పు దాదాపు రూ.18 లక్షలకు చేరింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి వత్తిడి పెరిగింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న ఆమె అన్న కూడా రుణం తీర్చే పరిస్ధితి లేక పోవటంతో మానసింకంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది. తల్లిని చంపి తాను చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. చనిపోయే ముందు తన బాయ్ ప్రెండ్ శ్రీధర్ రావుతో గడపాలనుకుంది. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని వారిద్దరూ ముందస్తుగానే పోర్టుబ్లెయిర్ కు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.

ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారు ఝామున ముందుగా సిధ్ధం చేసుకున్న కత్తితో తల్లి నిర్మలని హత్యచేసింది. ఆసమయంలో తల్లి పెనుగులాడటంతో జరిగిన శబ్దానికి లేచి వచ్చిన అన్న హరీష్ ను కత్తితో పొడిచింది. అనంతరం ఇద్దరూ చనిపోయి ఉంటారని భావించి… అప్పటికే బైక్ పై బయట సిధ్ధంగా ఉన్న ప్రియుడు శ్రీధర్ రావుతో కలిసి బెంగుళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ బైక్ ను  వదిలేసి ముందుగానే బుక్ చేసుకున్నటికెట్లతో ఇద్దరూ కలిసి పోర్టు బ్లెయిర్ వెళ్లిపోయారు. అక్కడ 5 రోజులు గడిపేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు.

కత్తిపోట్లకు తల్లి నిర్మల మృతి చెందగా, తీవ్ర గాయాలైన సోదరుడు హరీష్ సమీప బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన బంధువులు వచ్చి అతడ్ని ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. నిర్మల మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. హరీష్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సమాచారంతో విచారణ చేసిన పోలీసులు ఎయిర్ పోర్టు సమీపంలో శ్రీధర్ రావు బైక్ ను గుర్తించారు. 
 

సీసీటీపీ ఫుటేజిద్వారా వారు బెంగుళూరు ఎయిర్ పోర్టునుంచి  పోర్టు బ్లెయిర్ కు వెళ్లినట్లు కనుగొన్నారు. పోర్టు బ్లెయిర్ వెళ్ళిన పోలీసులు వారిద్దరి ఫోటోలు అక్కడి పోలీస్ స్టేషన్లకు పంపించారు. వారిచ్చిన సమాచారం మేరకు..సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హోటల్ రూమ్ లో ఉండగా అమృత,శ్రీధర్ రావును అరెస్టు చేసి బెంగుళూరు తీసుకువచ్చారు. పోలీసు విచారణలో… ఆదివారం నాడు అప్పుల వాళ్లు ఇంటికి వస్తానని చెప్పారని వారికి సమాధానం చెప్పలేక తల్లిని చంపి తాను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. మరోకసారి తన ప్రియుడికి ఇచ్చిన మాట ప్రకారం పోర్టు బ్లెయిర్ వెళ్లానని చెపుతోంది.

ఇవి ఖచ్చితమైన కారణాలు కాకపోవచ్చని..ఆమె మానసిక పరిస్ధితి సరిగా లేదని…కొంత సమయం తీసుకుని మళ్లీ విచారిస్తామని పోలీసులు చెప్పారు. మరోక వైపు శ్రీధర్ రావుని ప్రేమించటం కుటుంబ సభ్యులకు ఇష్టంలేదని.. అందుకు వారు అభ్యంతరం చెప్పటంతోనే వారిని హత్య చేసిందనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.