వరుస దొంగతనాలు : తాళం వేసిన ఇళ్లపై కన్ను
హైదరాబాద్ లో వరుస చోరీలు, గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు.
హైదరాబాద్ లో వరుస చోరీలు, గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు.
హైదరాబాద్ : ఓ వైపు దొంగలు.. మరో వైపు తెంపుడుగాళ్లు.. హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలు, గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లపై చోర్‌గాళ్లు కన్నేస్తే.. ఒంటరి మహిళలను టార్గెట్ చేశారు చైన్ స్నాచర్స్. వనస్థలిపురంలో నిత్యం ఏదో కాలనీలో ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అలర్ట్ అయినా వారికి చిక్కకుండా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు దొంగలు. కామ్‌గా తమ పని చేసేస్తున్నారు.
ఒక బ్యాచ్ కాకపోతే మరొకటి వంతులవారీగా దొంగతనాలు చేస్తోంది. గత నెల 26, 27 తేదీల్లో చైన్ స్నాచర్స్ వరుస దొంగతనాలతో బెంబేలెత్తించింది. 15 గంటల్లోనే 11 దొంగతనాలతో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలో చోరీలు చేస్తూ జనాన్ని వణికించింది. సీసీ కెమెరాలు లేని ఏరియాలను సెలెక్ట్ చేసుకొని మరీ తమ పని కానిచ్చేసింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. చైన్ స్నాచర్స్ వేటలో పడ్డారు.
గొలుసు దొంగల జాడ కోసం పోలీసులు పరిగెడుతుంటే.. వెనకనే అంతరాష్ర్ట దొంగల ముఠాలు ఎంటరయ్యాయి. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడ్డాయి. మరోసారి వనస్థలిపురం పైనే తమ ప్రతాపాన్ని చూపాయి. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్‌ల తాళాలు పగలగొట్టి అందినకాడికి దోచుకెళ్లాయి. ఈ వరుస దొంగతనాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మహా నగర భద్రతను సవాల్ చేశాయి.
సీరియల్ చోరీలతో అలర్ట్ అయ్యామని పోలీసులు చెబుతున్నా.. చైన్ స్నాచర్స్ అరెస్ట్ చూపెట్టినా.. ఆడపా దడపా స్నాచింగ్‌లు, చోరీలు జరుగుతూనే ఉన్నాయి. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు.. పగలు రెక్కీ నిర్వహిస్తూ, రాత్రి ఇళ్లంతా సర్దేస్తున్నారు. అలాగే ధనుర్మాసం సందర్భంగా ఉదయాన్నే ఆలయాలకు వెళ్లే మహిళల్ని.. వాకింగ్ చేసే వారి మెడల్లోని నగలను స్నాచర్స్ ఎత్తుకెళ్తున్నారు. మొత్తంగా నగరంలో దొంగలు పడ్డారు. ఒక బ్యాచ్ కాకుంటే మరోటి తమ హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నారు.