తిరుపతి గోవిందరాజ స్వామి కిరీటాల దొంగ అరెస్టు

తిరుపతి: తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం కిరీటాలు చోరీ చేసిన నిందితుడిని పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రతాప్ గా గుర్తించారు. చోరీ జరిగిన 80 రోజులకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్దనుంచి 3 కిరీటాలను కరిగించిన బంగారు కడ్డీలు, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన 3 కిరీటాల బరువు 1381 గ్రాములని. వాటి విలున సుమారు రూ.42 లక్షల 35 వేలని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
Also Read : షాకింగ్.. లక్షలు కొట్టేశారు : దొంగల బైక్.. ఈడ్చుకెళ్తున్నా బ్యాగు వదల్లేదు
నిందితుడు తన స్నేహితుడు విక్కీతో కలిసి నిజామాబాద్ లో చోరీలు చేసేవాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గతంలో సెల్ ఫోన్ చోరీ కేసులో ఇతడ్ని అరెస్టు చేశారు. 2019 ఫిబ్రవరి 1వ తేదీన తిరుపతి వచ్చి భక్తుడిలా గోవిందరాజ స్వామి ఆలయంలో రెక్కీ నిర్వహించాడు. మరుసటిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోనే మకాం వేసి పూజారి చూడకుండా మూడు కిరీటాలను చోరీ చేసి పరారయ్యాడు. దొంగతనం చేశాక నిందితుడు రేణిగుంట, కాచిగూడల్లో ఉన్న బంగారు వ్యాపారస్తుల వద్ద కిరీటాలను అమ్మటానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. గుడిలో ఉన్న సీసీ కెమెరా, ఓ వైన్ షాప్ వద్ద ఉన్న సీసీ కెమెరా, తర్వాత రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని ఎస్పీ వివరించారు. నిందితుడిని పట్టుకోటానికి ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అన్బురాజన్ తెలిపారు.
Also Read : ఇదే బెస్ట్ ఆప్షన్ : బ్యాంకుల్లోని మీ బంగారం భద్రమేనా?