ట్రైనీ ఐపీఎస్ భార్య సంచలన ఆరోపణలు

తొమ్మిదేళ్లు ప్రేమించాడు. ఏడాదిన్నర క్రితం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హోదా రావడంతో విడాకులు కావాలంటూ భార్యను వేధిస్తున్నాడు. ఇదీ.. కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డి బాగోతం. తన భర్తపై ఫిర్యాదు చేస్తే పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం లేదంటూ బాధితురాలు భావన రోడ్డెక్కింది. తనను పెళ్లి చేసుకుని మోసం చేసిన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితురాలు భావన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది.
తెలంగాణ డీజీపీ, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వద్దకు వెళ్లినా… వారు పట్టించుకోవడం లేదని వాపోయింది. మహేష్ భగవత్ తన ఐపీఎస్ హోదాను ప్రదర్శించారని… కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తనను నీచంగా చూస్తున్నారని భావన ఆరోపించారు. తనకు న్యాయం జరక్కపోగా ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.
కడప జిల్లాకు చెందిన మహేశ్వర్‌రెడ్డి తనను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని… ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యాక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన భావన… గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉస్మానియా యునివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు తాము ప్రేమించుకున్నామని.. ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నామని తెలిపారు.
కీసర రిజిస్టార్ ఆఫీస్‌లో తమ వివాహం జరిగిందన్నారు. అతడి ఇంట్లో తమ పెళ్లి విషయాన్ని చెప్పలేదన్నారు. ఐపీఎస్ అయిన తర్వాత మహేశ్వర్‌రెడ్డి ప్రవర్తనలో మార్పులొచ్చాయని ఎక్కువ కట్నం తీసుకుని మరోపెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని ఆరోపించింది. ఇందుకోసమే కులం పేరుతో వేధింపులకు గురి చేసి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపింది. మహేశ్వర్‌రెడ్డితో పాటు అతడి స్నేహితుడు నాగేందర్‌రెడ్డి కూడా తనను వేధించాడని భావన వాపోయింది. పోలీసుల నుంచి కూడా సరైన స్పందన లేదని చెప్పింది.
మరోవైపు ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో జులై 18న ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. సెప్టెంబర్ 4న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో మరోసారి కౌన్సెలింగ్ ఇచ్చామని… మహేశ్వర్‌రెడ్డి శిక్షణ అనంతరం రిసెప్షన్ ఏర్పాటుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయన్నారు.
Read More : దూసుకొస్తున్న తుఫాన్ : తూర్పుతీరంలో అప్రమత్తత