దారుణం : ట్రాక్టర్ తో తొక్కించి పెద్దమ్మను హత్య చేసిన వ్యక్తి

రాను రాను మనుషుల్లో మానవత్వం కొరవడుతోంది. ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడని సాయం చేస్తే…. అది మరిచిపోయి కర్కశంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. పొందిన సాయం మరిచి పెద్దమ్మనే ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం లో నివాసం ఉండే డేగల సుబ్బమ్మ(55) కి పొరుగున ఉండే మోరవాగుపాలెం నివాసి పగడం రాజశేఖర్ రెడ్డి స్వయానా చెల్లెలి కొడుకు. గతంలో ..తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి పెద్దమ్మ సుబ్బమ్మకు చెప్పగా, ఆమె తన వద్ద ఉన్న 16 సవర్ల బంగారు నగలు ఇచ్చి రాజశేఖర్ రెడ్డికి సహాయం చేసింది. అవి బ్యాంకులో తనఖా పెట్టి రాజశేఖర్ రెడ్డి డబ్బు వాడుకున్నాడు.
బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలను రాజశేఖర్ రెడ్డి ఇటీవల విడిపించి తన వద్దే ఉంచుకున్నాడు. ఈ సంగతి తెలిసిన సుబ్బమ్మ శనివారం నవంబర్ 9న తన ఇంటి ముందు నుంచి ట్రాక్టర్ పై వెళుతున్న రాజశేఖర్ ను ఆపి తన నగలు ఇవ్వమని అడిగింది. ఈ క్రమంలోవారిద్దరి మధ్య వాగ్వివాదం ఏర్పడింది. తన బంగారు నగలు తెచ్చి ఇచ్చేంతవరకు ట్రాక్టర్ ముందునుంచి కదలనని సుబ్బమ్మ ట్రాక్టర్ కు అడ్డంగా నిల్చుంది. దీంతో కోపం పెరిగిన రాజశేఖర్ రెడ్డి వేగంగా ట్రాక్టర్ ను ఆమె పై నుంచి నడిపాడు. దీంతో ట్రాక్టర్ కిందపడి సుబ్బమ్మ కన్నుమూసింది. ఇదంతా చూస్తున్న స్ధానికులు పారిపోతున్నరాజశేఖర్ రెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.