Ap Mega DSC 2025: మెగా డీఎస్సీ హాల్ టికెట్స్ లో సమస్యలా.. అయితే ఈ హెల్ప్ లైన్ నంబర్స్ కి కాల్ చేయండి

DSC Convener M Venkata Krishna Reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ 2025 కోసం హాల్ టికెట్లు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత శనివారం (మే 31) రాత్రి ఈ హాల్ టికెట్స్ ను విడుదల చేసింది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,347 టీచర్ పోస్టుల కోసం మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 5,77,417 వరకు వచ్చాయి. అందులో కొంతమంది అభ్యర్ధులు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం కారణంగా ఇంత పెద్దమొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6న మెగా డీఎస్సీ 2025 పరీక్ష జరుగనుంది.
అయితే దీనికి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైనప్పటి నుంచి అభ్యర్ధులందరు ఒక విషయంలో కంగారు పడుతున్నారు. అదేంటంటే.. ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల రాత పరీక్షల కేంద్రాలు వేరేవేరే జిల్లాల్లో కేటాయించడం. దానికి కారణం ఈ పోస్టులకు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకున్నారు. వారికోసం ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలు ఒక్కొక్కరికి వేర్వేరు జిల్లాల్లో, కొందరికి వేర్వేరు రాష్ట్రాల్లో కూడా పడ్డాయి. దాంతో అభ్యర్ధుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ విషయంపై డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణా రెడ్డి స్పందించారు. అభ్యర్ధులు ఇచ్చిన తొలి ఎంపిక ప్రకారంగానే పరీక్ష కేంద్రాలు కేటాయించామని తెలిపారు. నిజానికి ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ వేర్వేరు జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలు పడ్డాయి. దాంతో.. అభ్యర్థుల్లో ఉన్న ఆందోళనను అర్థం చేసుకున్న విద్యాశాఖ డీఎస్సీ హెల్ప్ డెస్క్ నంబర్స్ ను విడుదల చేసింది. 7013837359, 8121947387, 9398810958, 6281704160, 7995649286, 7995789286, 9963069286, 8125046997 ఈ నంబర్లకు ఫోన్ చేసి అభ్యర్ధులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని, అలాగే dscgrievances@apschooledu.in ఐడీకి మెయిల్ కూడా చేయొచ్చని డీఎస్సీ కన్వీనర్ ఎం వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.