JEE Main ఇక తెలుగులో

JEE Main పరీక్షలు తెలుగులో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కసరత్తు ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు జేఈఈ మెయిన్ పరీక్ష పత్రాల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు MHRD గుర్తించింది. పలు రాష్ట్రాల విజ్ఞప్తులను పరిశీలించింది. 2021 జనవరి నుంచి ఈ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో సహా 11 భాషల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని NTAను MHRD ఆదేశించింది. దాదాపు లక్షన్నర మందికి పైగా తెలుగు విద్యార్థులు రాసే ఈ పరీక్షలను తెలుగులోనూ నిర్వహించేలా చర్యలు చేపడుతోంది.
IIT, NIT, Tripul IT, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో BE/BTech, BArchలో ప్రవేశాల కోసం JEE మెయిన్‌ను మూడు భాషల్లోనే (హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..2013లో తమ భాషలోనూ పరీక్ష నిర్వహించాలని గుజరాత్ రాష్ట్రం కోరింది. తెలుగు రాష్ట్రాలు అప్పట్లో అడగకపోవడంతో తెలుగులో నిర్వహించలేదు. 2018 వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ పరీక్షలను నిర్వహించింది. 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2020, జనవరి 06వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు భాషల్లో పరీక్షలను నిర్వహించారు. వచ్చే ఏప్రిల్ 03వ తేదీ నుంచి 09వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలను మూడు భాషల్లోనే నిర్వహిస్తామని NTA స్పష్టం చేసింది.
వివిధ రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు, మాతృ భాషల్లో చదువుకున్న వారు నష్టపోకుండా ఉండేందుకు 11 భాషల్లో జేఈఈ మెయిన్‌ను పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయానికి వచ్చింది. ఆ 11 భాషల్లో 9 ప్రాంతీయ భాషలున్నాయి. 2021 జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, గుజరాత్, మరాఠీ, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహంచేలా చర్యలు చేపడుతోంది. ఇంకా ఏమైనా రాష్ట్రాలు అడిగితే..ఆయా భాషల్లోకి ప్రశ్నాపత్రాలను అనువాదం చేసి ఇచ్చే అంశాలను కూడా NTA పరిశీలిస్తోంది.
Read More : Yoga break : ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో వ్యాయామాలు