కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు… ప్రకటించిన ప్రభుత్వం

  • Published By: Chandu 10tv ,Published On : September 22, 2020 / 04:47 PM IST
కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు… ప్రకటించిన ప్రభుత్వం

Updated On : September 22, 2020 / 5:10 PM IST

కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం (సెప్టెంబర్ 21,2020) ప్రకటించింది. వీటిలో బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లోనే దాదాపుగా లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నాయని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఎక్కువగా ఖాళీలు ఏర్పడినట్టు తెలిపింది.




ఈ మేరకు సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 26,506, సీఐఎస్‌ఎఫ్‌లో 23,906, ఎస్ఎస్‌బీలో 18,643, ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్‌లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో ఎక్కవగా కానిస్టేబుల్‌ పోస్టులే ఉన్నాయని తెలిపారు.

రిక్రూట్ మెంట్ నిబంధనల ప్రకారమే ఖాళీల భర్తీ చేపడతామని మంత్రి తెలిపారు. వీటిలో కొన్ని పదోన్నతులు, డిప్యూటేషన్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మరికొన్నింటికి పదవులకు కొత్తగా నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.




ప్రస్తుతం 60,210 కానిస్టేబుల్‌ పోస్టులు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా 2,534 ఎస్ఐ పోస్టులనను భర్తీ చేయనుంది. అంతేకాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 330 అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.