ఇంటర్‌ ఫలితాల విడుదలపై పుకార్లు : ఆందోళన అనవసరం : ఇంటర్‌ బోర్డు

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 04:07 PM IST
ఇంటర్‌ ఫలితాల విడుదలపై పుకార్లు : ఆందోళన అనవసరం : ఇంటర్‌ బోర్డు

ఇంటర్ ఫలితాలు రేపు మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు విద్యార్థులు.. అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఐతే.. ఇంటర్‌ ఫలితాలు రావడానికి ఇంకా సమయం పట్టేలా వుంది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల వాల్యూయేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఏపీ ఫలితాలు వచ్చాయి కాబట్టి తెలంగాణ ఫలితాలు ఇంకా రాలేవని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇంటర్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు.
 
తెలంగాణాలో ఫిబ్రవరి 27 నుంచి మార్చీ 13 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఐతే పరీక్షలు మగిసిన వెంటనే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమై.. ఏప్రిల్ 5వ తేదీకి వాల్యూయేషన్ పూర్తయింది.. మరోవైపు వాల్యూయేషన్ చేసిన సంస్థ ఫలితాలు ఇంటర్ బోర్డుకి ఈ నెల 8వ తేదీన అందించింది. ఐతే.. ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సమచారం ఇచ్చేందుకే ఇన్ని రోజులు సమయం తీసుకున్నామని చెప్పారు బోర్డు ఉన్నతాధికారి. 

ఎన్నికల నేపథ్యంలో 11న అనుకున్న ఫలితాలను.. మరుసటి రోజు ప్రకటించాలని అనుకున్నారు. ఐతే.. గతేడాది చోటు చేసుకున్న తప్పిదాలు పునరావృతం అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంది బోర్డు. అందుకే జేఎన్టీయూ హైద్రాబాద్ పరీక్షల విభాగం నుంచి సహకారం తీసుకుని పూర్తిస్థాయిలో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐతే.. ఈ లోపు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణాలో సర్వత్రా ఆందోళన తీవ్రమైంది. మరోవైపు రేపు మాపు అంటూ వస్తున్న పుకార్ల వల్ల విద్యార్థుల్లో మరింత టెన్షన్ పెరిగింది. 

ఇప్పటికే ఫలితాలను పునః పరీశీలించిన జేఎన్టీయూ హైద్రాబాద్.. ఫలితాలను బోర్డుకి మరో రెండ్రోజుల్లో అందించనుంది. ఈనెల 15వ తేదీన ఫలితాలను విడుదల చేసేందుక బోర్డు  ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.