ఐఐఐటీ – హైదరాబాద్ : హై స్కూల్ స్టూడెంట్స్‌కు హైటెక్ శిక్షణ

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 02:42 AM IST
ఐఐఐటీ – హైదరాబాద్ : హై స్కూల్ స్టూడెంట్స్‌కు హైటెక్ శిక్షణ

హైదరాబాద్ : అంతా కాంపిటీషన్ యుగం. విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. విద్యార్థినీ, విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. హై స్కూల్ విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఐఐఐటీ – హెచ్ సంస్థకు వచ్చింది. వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఎండాకాలంలో విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణనివ్వాలని అనుకుంది. ప్రస్తుతమున్న విద్యారంగంలో అనుసరించాల్సిన విధానాలు..తదితర వాటిపై హైటెక్ శిక్షణ ఇవ్వాలని యోచించింది. 
సాంకేతిక అంశాలు..విశ్లేషణా సామర్థ్యం పెంపు, నైపుణ్య శిక్షణ, సమస్యల పరిష్కారం, కంప్యూటర్స్‌లోని ప్రాథమిక, ఆధునిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే దిశగా స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ఎస్‌టీఈపీ) ద్వారా అత్యాధునిక శిక్షణ ఇచ్చందుకు ఏర్పాట్లు చేశారు. 

2019 మే నెల 6 నుండి 31 వరకు గచ్చిబౌలిలో ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఐఐఐటీ అధ్యాపకులతో పాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు చిన్నారులకు ఆయా అంశాలపై హైటెక్ శిక్షణనివ్వనున్నారని పేర్కొన్నారు. శిక్షణలో ఎలాంటి అంశాలు చెప్పాలి…ఓ రిపోర్టును కోడ్ ఓఆర్ జీ సంస్థ రూపొందించింది. గణితం, కంప్యూటర్స్‌కు సంబంధించిన ఆధునిక అంశాలు, విద్యార్థుల్లో సునిశిత పరిశీలన, దృష్టిని పెంచేలా నైపుణ్య శిక్షణ, విశ్లేషణాత్మక సామర్థ్యం పెంపు, విభిన్న రకాల సమస్యల సాధనఫై తరగతిలో బోధనతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి.

7, 8 తరగతుల విద్యార్థులకు కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ అప్లికేషన్స్ (సీటీఏ), 9, 10 తరగతులు చదువుతున్న వారికి కంప్యూటేషన్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలపై శిక్షణిస్తారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందాలని అనుకున్న వారు httpas://www.iiit.ac.in/step వెబ్ సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుందని నిర్వహాకులు వెల్లడించారు. ముందుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.