UPSC Exams Competition : యూపీఎస్సీ పరీక్షల కోసం యువకులు సమయాన్ని వృథా చేస్తున్నారు.. సంజీవ్ సన్యాల్ కామెంట్స్!

UPSC Exams Competition : యూపీఎస్సీ పరీక్షల కోసం చాలామంది యువకులు ఏళ్ల తరబడి తమ సమయాన్ని వృథా చేస్తున్నారని సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యానించారు. ఇదే సమయాన్ని ఇతర రంగాలపై దృష్టిపెడితే ఎన్నో విజయాలను సాధించవచ్చునన్నారు.

UPSC Exams Competition : యూపీఎస్సీ పరీక్షల కోసం యువకులు సమయాన్ని వృథా చేస్తున్నారు.. సంజీవ్ సన్యాల్ కామెంట్స్!

Too many kids wasting time: Sanjeev Sanyal on competition in UPSC exams

UPSC Exams Competition : ప్రస్తుత రోజుల్లో యూపీఎస్సీ పరీక్షలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటడం అంత ఈజీ కాదనేది చాలామంది అభిప్రాయం. అందుకే ఏళ్ల తరబడి, గంటలకొద్ది యూపీఎస్సీ పరీక్షల కోసం కుస్తీ పడుతుంటారు. అయినా, సివిల్స్‌లో జాబ్ కొడతారన్న గ్యారంటీ లేదు. అయినప్పటికీ అనేక మంది యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దాంతో సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యేవారిలో పోటీ వాతావరణం నెలకొంది.

Read Also : UPSC CSE 2024 : యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్ష దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎలా అప్లయ్ చేయాలంటే?

యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ కొన్ని ఆసక్తికరమై విషయాలను ప్రస్తావించారు. చాలా మంది యువకులు యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు సన్నద్ధమవడంలో తమ విలువైన జీవితాన్ని వృథా చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే కొన్ని వేలమంది మాత్రమే యూపీఎస్సీ విషయంలో వెనక్కి తగ్గారని చెప్పారు. అదే యువత.. తమ ప్రయత్నాన్ని మరేదైనా పనిపై పెడితే.. భారత్ మరింత ప్రయోజనం పొందుతుందని సన్యాల్ అన్నారు. పోడ్‌కాస్ట్ ది నియాన్ షోలో సిద్ధార్థ అహ్లువాలియాతో ముచ్చటించిన సన్యాల్.. దశాబ్దాలుగా భారత్ అనుభవిస్తున్న పేదరికం గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ పరిస్థితి క్రమంగా మారుతోందని చెప్పారు.

అడ్మినిస్ట్రేటర్ కావాలనుకుంటేనే యూపీఎస్సీ పరీక్షలు :
పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలను ఉదాహరణలుగా సన్యాల్ పేర్కొన్నారు. బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో స్థానిక గూండా సంస్కృతిని ఉద్దేశించి అనేక అంశాలను ప్రస్తావించారు. మీరు స్థానిక గూండాగా మారకూడదనుకుంటే.. ప్రాథమికంగా సివిల్ సర్వెంట్ కావడమే మీ మార్గం అని మీకు తెలుసు’ అని సన్యాల్ అన్నారు. ప్రజలు తమ ఆకాంక్షల ఆధారంగానే రాజకీయ నేతలను ఎన్నుకుంటున్నారని చెప్పారు. ఇది గూండాగా ఉండటం కంటే ఉత్తమమే అయినప్పటికీ.. అది కూడా తన ఉద్దేశ్యంలో పేదరికమేనన్నారు. ‘మీరు నిజంగా ఏదైనా సాధించాలని కలలు కన్నట్లయితే.. కచ్చితంగా మీరు ఎలన్ మస్క్ లేదా ముఖేష్ అంబానీ కావాలని కలలు కంటున్నారు. మీరు జాయింట్ సెక్రటరీ కావాలని ఎందుకు కలలుకంటున్నారు? రిస్క్ తీసుకోవడం వంటి మొదలైన వాటి గురించి సమాజం ఎలా ఆలోచిస్తుందో మీరు ఆలోచించాలి. మీరు ఏది కోరుకుంటారో అదే తిరిగి పొందుతారు. భారతీయ యువకులు నిజంగా అడ్మినిస్ట్రేటర్ కావాలనుకుంటే మాత్రమే యూపీఎస్సీ పరీక్షలకు హాజరు కావాలి’ అని సన్యాల్ సూచించారు.

ఇతర రంగాల్లో ప్రయత్నిస్తే మరెన్నో విజయాలు :
‘యూపీఎస్సీని ఛేదించడానికి చాలా మంది యువకులు తమ సమయాన్ని వృథా చేస్తున్నారని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. యూపీఎస్సీ పరీక్ష రాయకూడదని నేను అనడం లేదు. అవును. ప్రతి దేశానికి బ్యూరోక్రసీ అవసరమే. కానీ, లక్షలాది మంది తమ అత్యుత్తమ సంవత్సరాలను పరీక్ష కోసమే వృథా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. కొన్ని వేల మంది యువకులు యూపీఎస్సీలో ప్రవేశిస్తున్నారు. ఇందులో ఎలాంటి అర్థం లేదు. వారు అదే శక్తిని మరేదైనా చేయడంలో పెడితే.. మనకు మరిన్ని ఒలింపిక్ బంగారు పతకాలు గెలుచుకుంటాం. లేదంటే మరిన్ని మంచి సినిమాలు తీస్తాం. మంచి వైద్యులను చూస్తాం. మరింత మంది వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలను చూస్తాం’ అని పేర్కొన్నారు.

ఇలా అయితే.. యూపీఎస్సీతో నిరాశ తప్పదు :
‘నేను అదే చెబుతాను. మీ ఆలోచనను యూపీఎస్సీ కాకుండా మరోదానిపై పెట్టండి. ఇది సమయం వృథా అని నేను చెబుతాను. నేను ఎల్లప్పుడూ వ్యక్తులను నిరుత్సాహపరుస్తాను. వారు నిజంగా అడ్మినిస్ట్రేటర్‌గా ఉండాలనుకుంటే తప్ప వారు యూపీఎస్సీ పరీక్షకు హాజరుకాకూడదు. వారిలో చాలా మంది వెళ్లి తమ కెరీర్‌లో నిరాశకు గురవుతారు. ఏదైనా వృత్తిలో మాదిరిగా ఇందులోని పనులు చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఫైళ్లను పైకి క్రిందికి పంపడం తప్ప ఏమి ఉండదు. మీరు ఇదే పని చేయాలనుకుంటే తప్ప ఈ విషయంలో సంతోషించలేరు’ అని సన్యాల్ అనేక వాస్తవ విషయాలను వివరించారు.

Read Also : UPSC CSE 2024 : సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఐఎఫ్ఎస్ హిమాన్షు త్యాగి గోల్డెన్ టిప్స్.. ఒత్తిడిని ఇలా డీల్ చేయండి!