Assembly Elections 2023: మంత్రి హరీష్ రావు మీద రెండు క్రిమినల్ కేసులు, 11 కోట్ల అప్పు, 24 కోట్ల ఆస్తులు
తన మీద ఉన్న క్రిమినల్ కేసులను హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 2 కేసులు అతనిపై పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన విద్య విషయానికి వస్తే.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Harish Rao: సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి మంత్రి హరీష్ రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పట్టణంలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి, పట్టణంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. కాగా, నామినేషన్ పత్రాల్లో ఆయన ఆస్తులు, అప్పులు వంటి వివరాలను ఎన్నికల సంఘానికి మంత్రి హరీష్ రావు సమర్పించారు. అందులో ఆయనకు 24 కోట్ల రూపాయల ఆస్తులు, 11 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.
వీటితో పాటు ఆయన వద్ద ఒక 32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉన్నట్లు ఎన్నికల సంఘం అఫిడవిట్లో పేర్కొన్నారు. చేతిలో నగదు సహా.. ఎల్ఐసీ ప్రీమియం, జీవా టెక్ సర్జికల్స్, అర్వైస్ నేచర్ ప్రోడక్ట్స్, ప్రెస్టన్ డెవలపర్‌లలో పెట్టుబడులు మొత్తం కలిపి 13.90 కోట్ల రూపాయల చర ఆస్తులు ఉన్నాయి. ఇక భూములు, నివాసం, వాణిజ్య ఆస్తులు 10.16 కోట్ల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఆయనకు 11.49 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు ఎన్నికల సంఘం అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇవి ఆయనతో పాటు తన భార్య శ్రీనిత పేరు మీద ఉన్నట్లు పేర్కొన్నారు.
వీటితో పాటు తన మీద ఉన్న క్రిమినల్ కేసులను హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 2 కేసులు అతనిపై పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన విద్య విషయానికి వస్తే.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సిద్దపేట హరీష్ రావుకు కంచు కోట అనే విషయం తెలిసిందే. ఆయన 2004 నుంచి సిద్దిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో 24,827 మెజార్టీతో విజయం సాధించిన ఆయన.. అనంతర ఎన్నికల్లో అంతకంతకూ మెజారిటీ పెంచుకుంటూ పోయారు. 2008 ఉప ఎన్నికల్లో 58,935 మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి హరీష్ రావు రాజీనామా చేశారు. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో 93,328 ఓట్ల మెజారిటీ, 2018 ఎన్నికల్లో 1,18,699 మెజార్టీతో విజయం సాధించి కనివినీ ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి, తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.