Assembly Elections 2023: రామమందిరం క్రెడిట్‭పై వివాదం.. కమలనాథ్‭పై విరుచుకుపడ్డ అమిత్ షా, ఓవైసీ

ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ తల్లి లాంటిది. రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ స్వయంగా 1986లో రామమందిర తాళాలు తెరిచారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం. దాన్ని ఎవరూ దాచలేరు

Assembly Elections 2023: రామమందిరం క్రెడిట్‭పై వివాదం.. కమలనాథ్‭పై విరుచుకుపడ్డ అమిత్ షా, ఓవైసీ

Updated On : November 3, 2023 / 7:56 PM IST

Remark on Ram Temple: రామమందిరం క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, అది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఘనతని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్‭పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నిజమైన ముఖం బయటపడిందని ఓవైసీ వ్యాఖ్యానించగా, తాము ప్రజల గొప్పతనం అంటుంటే కాంగ్రెసేమో గాంధీ కుటుంబం గొప్పదని అంటోందంటూ అమిత్ షా విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓ మీడియా సంస్థకు కమలనాథ్‭ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘1986లో రామమందిర తాళాలు తెరిచి, పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇప్పించింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. కానీ బీజేపీనేమో రామమందిరం క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజీవ్ గాంధీ పేరు ఎక్కడా కనిపించనివ్వడం లేదు. రామమందిరం దేశ ప్రజల సొత్తు. దాన్ని ఒక పార్టీకే ఆపాదించడం బీజేపీ కుంచిత రాజకీయం’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Caste Census: కులగణనపై యూటర్న్ తీసుకున్న బీజేపీ.. అమిత్ షా ఏమన్నారంటే?

ఇక కమలనాథ్‭ వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘మేము ఏ క్రిడిట్ తీసుకోలేదు. రామమందిర నిర్మాణం భారతీయుల ఆకాంక్ష, అది భారత ప్రజల గొప్పతనం, విజయం. కానీ కమలనాథ్‭ వ్యాఖ్యలు అలా లేవు. దేశ ప్రజల్ని అవమానించి రామమందిర గొప్పతనం రాజీవ్ గాంధీకి, గాంధీ కుటుంబానికి ఇస్తున్నారు. రాజకీయాల కోసం హిందువులుగా మారిన కొందరు (కాంగ్రెస్ నేతలు) ఎన్నికల కోసం ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే.. మీరు హిందువా కాదా?’’ అని అన్నారు.

ఇక అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. ‘‘ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ తల్లి లాంటిది. రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ స్వయంగా 1986లో రామమందిర తాళాలు తెరిచారు. కమలనాథ్‭ వ్యాఖ్యల్ని దేశ ప్రజలంతా వింటున్నారు. బాబ్రీ కూల్చివేతకు కారకులెవరు? అందులో కాంగ్రెస్ పాత్ర ఏంటనేది స్పష్టం అవుతూనే ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు ముఖం. దాన్ని ఎవరూ దాచలేరు’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: ఎన్నికలకు రావొద్దని బెదిరించిన నక్సలైట్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన పోలింగ్ సిబ్బంది