10TV Grama Swarajyam : వృత్తి పరంగా నేనొక డాక్టర్‎ని.. ఒకే ఒక్క లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

10TV Grama Swarajyam : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రం అభివృద్ధికోసం అందరం ఏకతాటిపైకి రావాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కోరారు.

10TV Grama Swarajyam : వృత్తి పరంగా నేనొక డాక్టర్‎ని.. ఒకే ఒక్క లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

MLC Balmuri Venkat

Updated On : December 28, 2025 / 2:18 PM IST

10TV Grama Swarajyam : నూతన సర్పంచ్‌లు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి బాధ్యతలను, మా బాధ్యతలను గుర్తుచేసేందుకు ప్రయత్నంచేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 10టీవీ యాజమాన్యంకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అభినందనలు తెలిపారు. 10టీవీ గ్రామ స్వరాజ్యం.. ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంలో బల్మూర్ వెంకట్ పాల్గొని మాట్లాడారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీనో.. మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సీఎం అయితేనో మన నియోజకవర్గం, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే పరిస్థితి మనం వచ్చామని, లేదా బై ఎలక్షన్ వస్తే మన ప్రాంతం అభివృద్ధి వస్తుందని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బల్మూర్ వెంకట్ అన్నారు.

Also Read : 10TV Grama Swarajyam : గ్రామ అభివృద్ధి కోసం నేను చెప్పిన రూల్స్ పాటిస్తే చాలు : ఎంపీ రఘునందన్ రావు

ప్రతి గ్రామంలోని ప్రజలు అడిగేది మౌలిక సదుపాయాలు. రోడ్లు, డ్రైయినేజీ, ఎడ్యుకేషన్, హెల్త్‌కు సంబంధించిన పనులనే అడుగుతారు. నేను వృత్తిపరంగా ఓ డాక్టర్ ను.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటేఒక్క లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చా. ప్రతీగ్రామంలోనూ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉండాలి. ఎందుకంటే ప్రతీ గ్రామంలో కూడా ప్రజలు అత్యధికంగా ఇబ్బందిపడే సమస్య అనారోగ్య సమస్య. ఈ క్రమంలో వారు వైద్యంకోసం అనేక డబ్బులు ఖర్చు చేస్తున్న పరిస్థితి. గతంలో ఈ విషయంపై శాసన మండలిలోకూడా మాట్లాడా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గురించి చెప్పడం జరిగిందని, తప్పనిసరిగా ఈ మేరకు దృష్టిసారిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని బల్మూర్ వెంకట్ తెలిపారు.

ప్రతీచోట కుల వ్యవస్థ ఉండొద్దని అందరం మాట్లాడుతాం.. కానీ, మళ్లీ మనం ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం అని ఏర్పాటుచేసి చిన్నతనం నుంచే వారిలో కులాలను గుర్తు చేస్తున్నాం. దాన్నికూడా తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్స్ ను ప్రతి నియోజకవర్గంలో తీసుకురావడం జరిగిందని బల్మూర్ వెంకట్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకునేలా ప్రయత్నం చేయాలి. కేంద్రంలో ప్రాతినిధ్యం వహించే వాళ్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చేలా.. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నిధులు వచ్చేలా ప్రయత్నం చేయాలి. అలా మన పోటీ అంతా రాష్ట్రంను అభివృద్ధి చేసుకునేలా ఉండాలి. కానీ, దురదృష్టంశాత్తూ మనం అభివృద్ధిపై పోటీ పడటం లేదన్నారు.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మొదట మనందరం సెంటిమెంట్, ఎమోషన్స్‌ను పక్కన పెడితే.. అభివృద్ధిపై చర్చపెట్టినప్పుడు  ప్రతిఒక్క నాయకుడిని అడిగే హక్కు ప్రతీ సర్పంచ్‌కు ఉంటుందని అన్నారు.

గ్రామంలో సర్పంచ్‌లు సరిగా పనిచేసి ప్రజల సమస్యలు తీర్చితేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు. వాస్తవానికి గ్రామంలో సమస్యలు పరిష్కరించకపోతే ఏ ప్రభుత్వానికి మంచి పేరు రాదు. గ్రామ స్థాయిలో సమస్యలను సంబంధిత నాయకులకు తెలియాలంటే.. ప్రభుత్వం దృష్టికి రావాలంటే గ్రామానికి సంబంధించిన సర్పంచులే వారదులు అని, ఆమేరకు సర్పంచ్ లు కృషి చేయాలని బల్మూర్ వెంకట్ సూచించారు.