రాజకీయంగా కలిసి రావడం లేదా? అందుకే కవిత ఆ పని చేస్తున్నారా..? అసలు బంజారాహిల్స్‌లో ఏం జరుగుతోంది?

బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత.. రాజకీయంగా కలిసి రావడం లేదని వాస్తు మార్పులు చేస్తున్నారా? బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.

రాజకీయంగా కలిసి రావడం లేదా? అందుకే కవిత ఆ పని చేస్తున్నారా..? అసలు బంజారాహిల్స్‌లో  ఏం జరుగుతోంది?

BRS MLC Kavitha

Updated On : July 4, 2025 / 11:52 AM IST

తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్రంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, ఇప్పుడు ఆమె తన ఇంటికి వాస్తు మార్పులు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో భారీ ఎత్తున వాస్తు మార్పులు జరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.

కొంతకాలంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కవిత, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ పెను సంచలనం సృష్టించింది. తన సోదరుడు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు కుటుంబంలోనే కాకుండా పార్టీలోనూ ప్రకంపనలు రేపాయి. అప్పటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.

బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై ఆందోళనలు చేస్తున్నప్పటికీ, తన పోరాటాలకు ఆశించిన గుర్తింపు రావడం లేదని కవిత తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఈ వైఫల్యాలకు “వాస్తు దోషమే” కారణమని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తు నిపుణుల సూచనల మేరకు కవిత బంజారా హిల్స్ లోని తన నివాసంలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇంటికి ఉన్న పాత మెయిన్ గేటును పూర్తిగా తొలగించి, సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉండేలా కొత్త గేటును ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా, పక్కనే ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా వాస్తు ప్రకారం మార్పులు చేపడుతున్నారట.

ఈ వాస్తు మార్పుల పనులన్నీ పవిత్రమైన శ్రావణ మాసం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్పుల తర్వాత తన రాజకీయ జీవితం విజయవంతం అవుతుందని, తాను చేపట్టే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయని కవిత గట్టిగా నమ్ముతున్నారట.