Joint Pains: యువతలో పెరుగుతున్న కీళ్ల నొప్పుల సమస్య.. 5 ప్రధాన కారణాలు.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనాలు

Joint Pains: విటమిన్ D, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాల లోపం కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గదిలో నుండి బయటకు పోకుండా వెలుతురు పడకుండా గడిపే యువతలో విటమిన్ D లోపం ఒక సాధారణ సమస్యగా మారింది.

Joint Pains: యువతలో పెరుగుతున్న కీళ్ల నొప్పుల సమస్య.. 5 ప్రధాన కారణాలు.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనాలు

5 main causes of joint pain in young people

Updated On : August 5, 2025 / 11:31 AM IST

కీళ్ల నొప్పుల సమస్య సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపించేది. కానీ, ఈ మధ్య యువతలో కూడా ఈ సమస్య అధికమవుతోంది. 25 నుంచి 40 సంవత్సరాల వయస్సు మధ్య వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, పని తత్వం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కలిసి కీళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి, యువతలో ఈ కీళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయి? దానికి గల 5 ప్రధాన కారణాలు, నివారణ చర్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

యువతలో కీళ్ల నొప్పులకు 5 ప్రధాన కారణాలు:

1.జీవనశైలిలో మార్పులు:
డెస్క్ జాబ్స్, ల్యాప్‌టాప్/ఫోన్‌ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల శరీరం కదలికలేనిదిగా అయిపోతుంది. ఇది కీళ్ల వద్ద రక్త ప్రసరణను తగ్గించడమే కాకుండా, నరాలు కదలికలను తగ్గిస్తాయి. ఫలితంగా నొప్పులు రావడం ప్రారంభమవుతుంది.

2.ఆహారపు లోపాలు:
విటమిన్ D, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాల లోపం కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గదిలో నుండి బయటకు పోకుండా వెలుతురు పడకుండా గడిపే యువతలో విటమిన్ D లోపం ఒక సాధారణ సమస్యగా మారింది. దీనివల్ల కూడా కీళ్ల సమస్య వచ్చే అవకాశం ఉంది.

3.వ్యాయామం:
ఈ మధ్య చాలా మంది ఆరోగ్యం కోసం వ్యాయాయం చేస్తున్నారు. అలాంటివారిలో అతి వ్యాయామం చేయడం, లేదా తప్పుగా వ్యాయామం చేయడం వంటి వాటి వల్ల కూడా కీళ్ల నొప్పులు రావచ్చు.

4.మునుపటి గాయాల ప్రభావం:
పూర్వపు స్పోర్ట్స్ గాయాలు, సరిగ్గా చికిత్స తీసుకోకపోవడం వంటివి చేయడం వల్ల కూడా కీళ్ల సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది.

5.ఆటోఇమ్యూన్ వ్యాధులు:
రుమటాయిడ్ ఆర్థ్రిటిస్, లూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు చిన్న వయస్సులోనూ కీళ్ల నొప్పులకు కారణమవుతాయి.

నివారణ చర్యలు:

1.ప్రతిరోజూ శారీరక కదలిక అవసరం:
రోజులో కనీసం 30 నిమిషాల నడక, వ్యాయామాలు, యోగా చేయడం వల్ల కీళ్ల కదలిక మెరుగవుతుంది. అంతేకాకుండా, అధిక బరువు తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.

2.పోషకాహారం తీసుకోవాలి:
విటమిన్ D, కాల్షియం, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఇది పాలు, చేపలు, డ్రై ఫ్రూట్స్ లో అధికంగా లభిస్తాయి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

3.సరైన వ్యాయామ విధానం:
వ్యాయామాలు చేయడంలో సరైన పద్ధతులు పాటించాలి. జిమ్ ట్రైనర్ లేదా ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో వ్యాయామం చేయడం మంచిది.

4.తగిన విశ్రాంతి,నిద్ర:
కీళ్ల పునరుద్ధరణకు నిద్ర చాలా అవసరం. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పకుండా పోవాలి. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.

కీళ్ల నొప్పులు అనేవి చిన్నగా అనిపించినా, దీర్ఘకాలంలో పెద్ద సమస్యలకీ దారి తీయవచ్చు. యువత తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. సరైన జాగ్రత్తలతో కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.