స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మకంపై నిషేధం

పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే సాఫ్ట్ డ్రింకులు, చిప్స్, బర్గర్, సమోసా, ప్యాకేజ్డ్ జ్యూసులతో సహా అన్ని రకాల జంక్ ఫుడ్‌ను దేశంలోని అన్ని పాఠశాలలు, బోర్డింగ్ స్కూళ్లలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. స్కూళ్లు, బోర్డింగ్ స్కూళ్లలోని కేఫ్‌టేరియాలలో జంక్ ఫుడ్‌ను అమ్మడమే కాదు వాటికి సంబంధించిన ప్రచారాలు చేయడం, ఫ్రీ శాంపిల్స్ అందచేయడం, వెండింగ్ మెషిన్లను పెట్టడాన్ని కేంద్రం నిషేధించింది.
వెండింగ్ మెషిన్లపైన, పుస్తకాలు, స్కూలుకు సరఫరా చేసే సామగ్రి, పాఠ్యపుస్తకాల కవర్లపై ఎటువంటి లోగోలను ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు అంటించకూడదని కూడా ది ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ముసాయిదాలో తెలిపింది. జంక్ ఫుడ్ ను స్కూళ్లలోనే కాక వాటికి 50 మీటర్ల పరిధిలో కూడా ఎక్కా అమ్మకుండా చర్యలు తీసుకోవాలని ముసాయిదాలో పేర్కోంది. అదే విధంగా స్కూలుకు సంబంధించిన ఫర్నీచర్ లేదా ఇతర ఆస్తులపై కూడా జంక్ ఫుడ్ కు సంబంధించిన ఎటువంటి ప్రచార లోగోలు, పోస్టర్లు అంటించరాదు.
పాఠశాల విద్యార్థులు అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించే క్రమంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) కొత్త నిబంధనలను రూపొందించింది. కొవ్వు, ఉప్పు, చక్కెర పదార్థాలు అధికంగా సాఫ్ట్ డ్రింకులు, చిప్స్, నూడుల్స్, ఇతర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను స్కూళ్లలో విక్రయించడంపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించింది. వీటిని తినటం వల్ల పిల్లలకు చిన్న వయస్సులోనే ఉబకాయం, డయాబెటిస్, కేన్సర్లు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందచేయడానికి అవసరమైన మెనూను ఎప్పటికప్పుడు రూపొందించుకోవలసిందిగా ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది.