కరోనా ఎఫెక్ట్: చైనీస్, సందర్శకులకు వీసా కష్టాలు.. నో ఎంట్రీ..!

డ్రాగన్ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం కాటేసింది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో చైనాలోని ఇతర దేశాల పౌరులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే చైనా మాత్రం.. విదేశీ పౌరుల్లో ఎవరికైనా అనుమానిత వైరస్ లక్షణాలు ఉంటే వారిని దేశం విడిచి వెళ్లేందుకు చైనా అనుమతించడం లేదు. వైరస్ ప్రభావిత నగరమైన వుహాన్ లో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులను ఏ దేశమైన తమ దేశానికి తిరిగి తీసుకెళ్లొచ్చునని ఒక ప్రకటలో వెల్లడించింది.దీంతో ప్రపంచ దేశాలన్నీ తమ స్వదేశీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టాయి.
వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన :
ఈ క్రమంలో చైనా నుంచి కరోనా వైరస్ ఇతర దేశాల్లోకి కూడా ప్రవేశించింది. అక్కడక్కడ కొన్ని అనుమానిత వైరస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోకి చైనా నుంచి వచ్చే వారిని అనుమతించడం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ముప్పు ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ, భారత్ సహా కొన్ని దేశాలు మాత్రం స్వదేశీయులను తిరిగి తీసుకుచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దేశంలోకి ప్రవేశానికి వీసా జారీ చేసేందుకు భయపడుతున్నాయి.
శ్రీలంక, యూరప్‌లో ఎంట్రీ వీసా పాలసీ సస్పెన్షన్:
అందుకే వీసా పాలసీని సస్పెండ్ చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే శ్రీలంక, యూరప్ దేశాలు చైనా నుంచి వచ్చే పౌరుల వీసాలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. చైనా నుంచే స్వదేశీ పౌరుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ, వారికి ప్రధాన భూభాగానికి దూరంగా నిర్బంధ కేంద్రాల్లో వసతి సదుపాయాలను అందిస్తున్నాయి. కానీ, చైనా పౌరుల విషయంలో మాత్రం వీసా పాలసీని రద్దును అమల్లోకి తీసుకొస్తున్నాయి. స్వదేశీయుల విషయంలో కూడా కొన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
Read Also : #Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!
చైనా నుంచి తిరిగి తమ దేశంలోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయి. ఒకవేళ అనుమతి ఇస్తే.. వారి నుంచి వైరస్ మరొకరికి వ్యాపించి ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే శ్రీలంక తమ దేశానికి వచ్చే చైనా పౌరులకు ఎంట్రీ వీసా పాలసీని సస్పెండ్ చేసింది. ఇటీవలే చైనా నుంచి వచ్చిన ఒకరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అక్కడి వైద్యాధికారులు నిర్ధారించిన మరుసటి రోజునే శ్రీలంక ఈ వీసా పాలసీని సస్పెండ్ చేస్తు నిర్ణయం తీసుకుంది.
లంకలో మొదటి కరోనా కేసు :
శ్రీలంకలో చైనాకు చెందిన 40ఏళ్ల మహిళకు కరోనా వైరస్ పాజిటీవ్ అని నిర్ధారించినట్టు దేశీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎపిడెమిలాజిస్ట్ చీఫ్ సుదాత్ సురవీరా వెల్లడించారు. ‘చైనీస్ మహిళ జనవరి 19న శ్రీలంకకు చేరుకుంది. జనవరి 25న ఆమె విమానశ్రయంలో బయల్దేరే సమయంలో స్ర్కీనింగ్ నిర్వహించగా అందులో పాజిటీవ్ అని తేలింది. వెంటనే బాధితురాలని సంబంధిత ఆస్పత్రిలో చేర్పించాం’ అని ఆయన చెప్పారు. శ్రీలంకలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో దేశీయ వైద్యాధికారుల విభాగం వెంటనే చైనా పౌరుల ప్రవేశానికి సంబంధించిన వీసా పాలసీని సస్పెండ్ ఆదేశాలు జారీ చేసింది.
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా (చైనా పౌరులు, స్వదేశీయులు) తప్పనిసరిగా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా వీసాకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఎయిర్ పోర్టు ప్రవేశ మార్గం, బయల్దేరే టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులకు మాత్రమే షరతులు వర్తిస్తాయని కొలంబో అంతర్జాతీయ విమానశ్రయం అధికారులు తెలిపారు. సోమవారం నాటికి చైనా నుంచి 65మంది శ్రీలంక విద్యార్థులు స్వదేశానికి వచ్చారు.
మరి కొంతమంది లంక విద్యార్థులను తీసుకొచ్చేందుకు మరో విమానం కూడా వెళ్లింది. గత మూడు రోజుల్లో మొత్తం చైనా నుంచి 204 మంది విద్యార్థులను లంక స్వదేశానికి తరలించింది. మరోవైపు చైనీస్ పర్యాటకులకు శ్రీలంక ప్రధాన ప్రయాణ మార్గంగా మారింది. చాలామంది చైనీయులు చైనా నిధులతో కూడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా పనిచేస్తుంటారు.
యూరప్‌లో చైనీయులపై ఎంట్రీ వీసా ఆంక్షలు :
మరోవైపు యూరప్ కూడా చైనీస్ పౌరులను తమ దేశంలోకి ప్రవేశానికి అనుమతించడం లేదు. తమ భూభాగంలో ఇప్పటికే 8 కరోనా వైరస్ కేసులే నమోదు కావడంతో యూరప్ ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో నాలుగు కరోనా కేసులు ఫ్రాన్స్, మిగిలిన కేసులు జర్మనీలో గుర్తించింది. అప్పటినుంచి చైనా నుంచి వచ్చే విదేశీయులపై ఎంట్రీ వీసాలపై ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో చైనాకు వెళ్లిన చైనా జాతీయుల విషయంలో వీసా ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.
ప్రస్తుత వైరస్ తీవ్రతను కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈయూ సివిల్ ప్రొటెక్షన్ మెకానిజం యాక్టివేట్ చేయాలని ఇదివరకే నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో వైరస్ మరింత వ్యాపించే ముప్పు ఉండటంతో ఈయూ ఈ వారం చివరిలో తమ ప్రధాన భూభాగంలోకి చైనా పౌరులు, ఇతర సందర్శకులపై ప్రవేశ ఆంక్షలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు: #Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!