కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన జనరిక్ ఔషధం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తోపాటు ఔషధంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా డెక్సమెథసోన్ అనే జనరిక్ ఔషధం కరోనా రోగుల్లో మరణాల తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రాథమిక ప్రయోగాల్లో నిరూపతమైందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రకటించారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ధృవీరించింది. కరోనా ఔషధ పురోగతిలో ఇది గొప్ప విషయమంటూ బ్రిటన్ శాస్త్రవేత్తలను ప్రశంసించింది.
ఆక్సిజన్ , వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న కరోనా రోగుల మరణాలను తగ్గించడంలో ఉపయోగపడుతున్న మొదటి ఔషధం ఇదే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రకటించారు. ఎంతో మంది ప్రజలను కాపాడగలిగే ఈ ఔషధం ప్రయోగాల్లో పురోగతి సాధించేందుకు కృషి చేసిన బ్రిటన్ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ ను అభినందిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ తెలిపారు. వీరితోపాటు ఈ పురోగతికి దోహదపడిన హాస్పిటల్స్, రోగులను కూడా అభినందిస్తున్నామని చెప్పారు.
డెక్సమెథసోన్ ఔషధం ప్రయోగ ఫలితాల గురించి బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులతో పంచుకున్న అనంతరం ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది. దీనిపై మరింత విశ్లేషణ చేసిన అనంతరం పూర్తి సమాచారం ఇస్తామని తెలిపింది. ఈ ఔషధాన్ని కరోనా రోగులకు ఎలా, ఎప్పుడు వినియోగించాలో అనే విషయాన్ని డబ్ల్యూహెచ్ వో ప్రయోగ మార్గదర్శకాల్లో త్వరలోనే పొందుపరుస్తామని తెలిపింది.
అంతకముందు అతి తక్కువ ధరకు లభించే ఈ ఔషధం కరోనాతో బాధపడుతూ వెంటిలేటర్ పై ఉన్న వారికి ఆక్సిజన్ లా పని చేస్తుంది అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే తెలిపారు. ఈ జనరిక్ ఔషధం వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రయోగాల్లో గుర్తించామని మరో పరిశోధకుడు పీటర్ హార్బీ వెల్లడించారు.
Read: టాయిలెట్లు ఫ్లష్ చేసినా కరోనా వ్యాప్తి