తలపై జుట్టు ఊడిపోతుందా.. బట్టతల వచ్చిందా..? డోంట్ వర్రీ.. మీ సమస్యకు శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు.. ఎలా అంటే..
చిన్న వయస్సులోనే చాలా మంది విపరీతంగా జుట్టురాలిపోవడం, బట్టతల రావడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణం అయిపోయింది.

Harvard University scientists
Hair loss problem: కేశ సంపద మనిషి అందాన్ని మరింత పెంచుతుంది. దీంతో చాలా మంది జుట్టును కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. అధికశాతం మంది జుట్టు రాలిపోతుండటంతోపాటు బట్టతల సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల క్రీములు వాడుతుంటారు. అంతేకాక బట్టతల వచ్చిన వారు మళ్లీ జుట్టు కోసం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి వ్యయ ప్రయాస లతో కూడిన పద్దతులు వాడుతున్నారు. అయితే, ప్రస్తుతం జట్టు రాలిపోతున్న, బట్టతల కలిగిన వారి సమస్యకు పరిష్కారానికి కనుగొన్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.
అతిసూక్ష్మమైన సూదులతో పట్టీ..
చిన్న వయస్సులోనే చాలా మందికి విపరీతంగా జుట్టురాలిపోవడం, బట్టతల రావడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణం అయిపోయింది. అయితే, జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు ఓ కొత్త పద్దతిని ఆవిష్కరించినట్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నొప్పి ఏ మాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి, ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా బట్టతలపై జుట్టు మొలిచేలా చేయొచ్చునని శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని ఎలుకలపై పూర్తి చేశారు. మంచి సత్ఫలితాలు సాధించామని శాస్త్రవేత్తలు తెలిపారు.
అలోపీసియానే కారణమా..
అలోపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ, ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ‘‘శరీర రోగ నిరోధక వ్యవస్థే బ్యాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు.’’ అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ- కణాలు వెంకట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్నమాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, చాలా మందికి రాలిపోయిన వెంట్రుకలు వచ్చే అకాశం ఉండదు.
పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
కీళ్ల నొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కావడంతో చికిత్సకు మందులు ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం, మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలిపోవడం మొదలవుతుండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఈ క్రమంలో ఆ మందుల్లో ఏదో విషయం ఉందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అయితే, మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ-కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్ ప్యాచ్ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లో వెంట్రుకలు పెరగడం మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.