దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇండోర్‌లో కరోనా వైరస్ జాతి మరింత తీవ్రమైనది

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. మన దేశంలోనూ కరోనా వైరస్ పంజా విసిరింది. దేశవ్యాప్తంగా 30వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కాగా, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇండోర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ జాతి భయపెడుతోంది. ఇతర ప్రాంతాల్లోని వైరస్ తో పోలిస్తే ఇండోర్ లో బయటపడ్డ వైరస్ మరింత తీవ్రత కలిగి ఉందని పరిశోధనల్లో తేలింది.
మధ్యప్రదేశ్ లోని కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లో ఇండోర్ ఒకటి. ఇండోర్ లో కరోనాతో 57మంది చనిపోయారు. ఇండోర్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. అంతే కాదు ఇక్కడి వైరస్ జాతిలో తీవత్ర ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇండోర్ నుంచి సేకరించిన కరోనా వైరస్ పై పరిశోధనలు చేసేందుకు శాంపుల్స్ ను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి(NIV) పంపారు. కరోనా రోగుల నుంచి శాంపుల్స్ సేకరించేందుకు ఇండోర్ లో ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ మెమోరియాల్ మెడికల్ కాలేజీ డీన్ ను ఈ టీమ్ కు హెడ్ గా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కు సంబంధించి 5 జాతులను గుర్తించారు. కరోనా సోకిన రోగులు చాలా ఆలస్యంగా ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. దీని కారణంగా ఇండోర్ లో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా దేశంలోని పరిశ్రుభమైన నగరంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ గుర్తింపు పొందింది. గత మూడేళ్లు వరుసగా పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ ఎంపికైంది. అలాంటి నగరం ఇప్పుడు కరోనా వైరస్ కి హాట్ స్పాట్ గా మారడం వైద్య నిపుణులను, పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇండోర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ జాతి తీవ్రమైనది కావడం వల్లే ఇక్కడ కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
దేశంలో 29వేల 439 కరోనా కేసులు, 931 మరణాలు:
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 29వేల 439కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 931మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6వేల 734. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3వేల 108కి చేరింది. 54మంది కరోనాతో చనిపోయారు. 877మంది కోలుకున్నారు. మహారాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8వేల 590కి చేరింది. ఇప్పటివరకు 1,282మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనాతో 27మంది చనిపోయారు.
తెలంగాణలో తగ్గుదల, ఏపీలో పెరుగుదల:
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగింది. గతంలో పోలిస్తే రోజువారీగా కేసుల నమోదు బాగా తగ్గింది. సోమవారం(ఏప్రిల్ 27,2020) కేవలం రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 1003కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 646. ఏపీలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,177కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 31మంది చనిపోయారు. 235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 911. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 30.60 లక్షల కేసులు, 2.11లక్షల మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30.60 లక్షలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.11లక్షల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9.21లక్షల మంది కోలుకున్నారు.