COVID Variant JN.1 Updates: జేఎన్.1 వేరియంట్ కేసులు ఏఏ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.. దీని లక్షణాలు ఏమిటి? వ్యాక్సిన్ ఉందా ..
జేఎన్.1 వేరియంట్ ను 2023 సెప్టంబర్ లో తొలిసారి అమెరికాలో గుర్తించారు. ఈ సబ్ వేరియంట్ కు చెందిన 15 కేసుల్ని చైనాలో కూడా గుర్తించారు. ఈ జేఎన్.1 వేరియంట్ మనిషి రోగనిరోధక శక్తిపై ...

Variant JN.1
JN.1 Variant : దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ లలో మళ్లీ కోరలు చాస్తోంది. ప్రస్తుతం కొత్తగా జేఎన్.1 కోవిడ్ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ తరహా కేసులను మూడు రాష్ట్రాల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. వీటిలో గోవాలో అత్యధికంగా 19 కేసులు, కేరళ, మహారాష్ట్రాల్లో ఒక్కొక్క టి చొప్పున జేఎన్.1 వేరియంట్ కేసులను గుర్తించారు. జేఎన్.1 వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అసలు ఈ కొత్త వేరియంట్ ఏమిటి..? దానివల్ల ఏమేరకు ప్రమాదం పొంచిఉంది? అనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వైరస్ లు ఎప్పటికప్పుడు తమరూపును మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పులను మ్యుటేషన్స్ అని పిలుస్తారు. వాటి ఫలితంగా వచ్చే వైరస్ ‘వేరియంట్’ అని పిలువబడుతుంది. కొన్నిసార్లు వీటి మధ్య వైవిద్యాలు పూర్తిగా భిన్నమైన వైరస్ లక్షణాలను కలిగి ఉండొచ్చు. ప్రస్తుతం విస్తృతంగా చలామణిలో ఉన్న అనేక కోవిడ్ -19 వేరియంట్ లు మరింత సులభంగా ఒకరినుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. ప్రస్తుతం దేశంలో ఆందోళన కలిగిస్తున్న జేఎన్.1 కరోనా వేరియంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తిని యూఎస్, చైనా, సింగపూర్ తో పాటు భారతదేశంలోనూ గుర్తించారు. దీని లక్షణాలు మునపటి వేరియంట్ల మాదిరిగానే ఉంటాయి. గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2.86కి జేఎన్.1 వేరియంట్ కు దగ్గర సంబంధం కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సీడీసీ ప్రకారం.. బీఏ.2.86 వేరియంట్ కు 20 మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. స్పైక్ ప్రొటీన్ల స్టడీ ఆధారంగా ఆ విషయాన్ని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న జేఎన్.1, బీఏ.86 వేరియంట్లలోఉన్న స్సైక్ ప్రొటీన్లలో కేవలం ఒక్క మార్పు మాత్రమే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జేఎన్.1 వేరియంట్ ను 2023 సెప్టంబర్ లో తొలిసారి అమెరికాలో గుర్తించారు. ఈ సబ్ వేరియంట్ కు చెందిన 15 కేసుల్ని చైనాలో కూడా గుర్తించారు. భారతదేశంలో తొలిసారి డిసెంబర్ 8న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా కరకులంలో జేఎన్.1 వేరియంట్ ను గుర్తించారు. ఈ జేఎన్.1 వేరియంట్ మనిషి రోగనిరోధక శక్తిపై సమర్థవంతంగా దాడిచేసే సామర్థ్యం కలిగి ఉందని, అయితే, ఈ వేరియంట్ వల్ల ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
జేఎన్.1 వేరియంట్ తీవ్రమైనదిగా పరిగణించాలా అంటే.. ఇరత వైరస్ ల కంటే జేఎన్.1 కరోనా వేరియంట్ మరింత తీవ్రమైన వేరియంట్ గా కారణమవుతుందని ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు. ఇది ఒకరినుంచి మరొకరికి వేగంగా విస్తరించే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ తరహా వైరస్ శీతాకాలంలో ప్రవేశించే దేశాల్లో ఎక్కువ విస్తరిస్తుందని అంచనా వేసింది. ఇదిలాఉంటే.. జేఎన్.1 వేరియంట్ ను నివారించేందుకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లు లేవు. ప్రస్తుత వ్యాక్సిన్లు జేఎన్.1కు కొవిడ్ -19 ఇతర వేరియంట్ ల నుంచి రక్షణ పొందడానికి ఉపయోగించొచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.