హోం క్వారంటైన్ నిరాకరించి పెళ్లి చేసుకున్న వరంగల్ వరుడు!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో భయాందోళన నెలకొంది. విదేశాల నుంచే వారిలోనే ఎక్కుమందికి కరోనా లక్షణాలు ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారిని ఎయిర్ పోర్టుల వద్దే స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచే చాలామందిపై అధికారులు నిరంతరం నిఘా పెడుతూ కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవలే ఫ్రాన్స్ నుంచి వరంగల్‌కు చెందిన వ్యక్తి తెలంగాణకు తిరిగి వచ్చాడు. అతడిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ అతన్ని 14 రోజుల వరకు ఇంట్లోనే క్వారంటైన్ గా ఉండాలని అధికారులు సూచించారు. అందుకు అతడు అంగీకరించలేదు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఏడు రోజుల తర్వాత వరంగల్ టౌన్‌లో గురువారమే ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.
ఈ పెళ్లి వేడుకకు వెయ్యి మంది వరకు అతిథులు హాజరయినట్టు వరుడి తండ్రి చెప్పినట్టు వారికి దగ్గరి వ్యక్తి ఒకరు మీడియాకు వెల్లడించారు. వివాహం అనంతరం రిస్పెప్షన్ ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలిసిన అధికారులు.. అతన్ని తిరిగి క్వారంటైన్‌కు తరలించడంతో శుక్రవారం జరగాల్సిన రిసెప్షన్ రద్దు అయింది. వివాహ వేడకకు హాజరైన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. వివాహ వేడుకలో పెళ్లికొడుకు గానీ పెళ్లికూతురు సహా ఎవరూ మాస్క్ లు ధరించలేదన్నారు.
క్వారంటైన్ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. పెళ్లికుమారుడు తన స్నేహితుడితో కలిసి మార్చి 12న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు తిరిగివచ్చాడు. వీరిద్దరిని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. ఏది ఏమైనా వీరిద్దరూ మ్యారేజీ కోసం వరంగల్ కు వెళ్లిపోయారు. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా వెడ్డింగ్ హాల్స్ బుకింగ్స్ లేదా పెద్ద సంఖ్యలో ఈవెంట్లపై నిషేధం విధిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.