సంతాన యోగం : పురుషుల కోసం ప్రత్యేకం

సంతాన యోగం : పురుషుల కోసం ప్రత్యేకం

Updated On : March 17, 2021 / 3:31 PM IST

పిల్లలు పుట్టటం లేదని బాధపడుతున్న దంపతుల్లో… మగవారి కోసం కొన్ని యోగా ట్రిక్కులు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మూడు వారాల పాటు ఈయోగాసనాలు వేస్తే పురుషుల్లో వీర్యకణాల వృధ్ది బాగా పెరుగుతుందని సెలవిస్తున్నారు హైదరాబాద్ లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)తో కలిసి సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ అంశం వెల్లడయ్యింది.

సంతానోత్పత్తి కణాలు తక్కువగా ఉన్న పురుషులతో 21 రోజులపాటు రోజుకు గంట చొప్పున సంప్రదాయ యోగా విధానంలోని ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించడం వల్ల వారిలో వీర్యకణాల నాణ్యత పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సంతానలేమితో బాధపడే పురుషులు ఆధునిక వైద్యవిధానంతో పాటు యోగా పద్ధతులు అనుసరించడం వల్ల ఫలితం ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు.

మానవ జన్యు వ్యవస్థపై వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. అనారోగ్యకర జీవనశైలి, దురలవాట్ల కారణంగా డీఎన్‌ఏలో రసాయన మార్పులు చో టుచేసుకుని వీర్యం నాణ్యత తగ్గుతుందని కూడా వింటుంటాం. ఈ మార్పులను యోగాతో అ ధిగమించొచ్చని తాజా అధ్యయనం చెబుతోంది.

వంధ్యత్వ సమస్యల తో బాధపడుతున్న పురుషులు యోగా ఆధారిత జీవనశైలి అలవర్చుకుంటే వీర్యకణాలు చురుగ్గా మారడంతో పాటు వీర్యంపై ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కూడా తగ్గుతుంది. తద్వారా సంతానం కలిగేందుకు ఉన్న అవకాశాలు పెరుగుతాయని వీరు చెపుతున్నారు.

ccmb scientists

యోగా ప్రక్రియను అనుసరించిన వారి వీర్యకణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, వీర్యకణాల చురుకుదనంలో వేగం పెరిగింది. దీంతో వీర్యకణాలు ఫలదీకరణ సామర్థ్యాన్ని పెంపొందించుకొన్నట్టు నిర్ధారించారు. యోగా చేయడం వల్ల డీఎన్‌ఏ కదలికలను విశ్లేషించే మిథైలేషన్‌ అనే రసాయనిక మార్పు యథాస్థితికి చేరినట్టు గుర్తించారు.

వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లు, చెడు అలవాట్లు, క్రమపద్ధతి లేని జీవనవిధానం వల్ల జన్యుక్రమం విపరీతమార్పులకు లోనై, సంతానోత్పత్తి కణాలకు హాని కలుగుతుందని రాకేశ్‌మిశ్రా చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యశాలలో వంధ్యత్వ సమస్యలకు చికిత్స పొందుతున్న కొంతమందిని ఎంచుకుని తాము అధ్యయనం చేశామని సీసీఎంబీ శాస్త్రవేత్త సురభి శ్రీవాత్సవ తెలిపారు.

వీరు రోజుకు గంట చొప్పున వేర్వేరు ఆసనాలు వేయడంతో పాటు ప్రాణాయామం, ధ్యానం వంటి యోగా క్రియలను అనుసరించారు. యోగా కార్యక్రమంలో చేరే ముందు.. ఆ తర్వాత వీరి వీర్యాన్ని పరిశీలించగా ఆసక్తికరమైన మార్పులు కనిపించాయని శ్రీవాత్సవ వివరించారు. 400 జన్యువులు ఆన్‌/ఆఫ్‌ అయ్యేందుకు కీలకమైన మిథైలోమ్‌ను యోగా ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టమైందన్నారు.

వీటిల్లో పురుషుల సంతాన లేమికి వీర్య ఉత్పత్తికి ఉపయోగపడే జన్యువులు ఉన్నాయి. ఈ అధ్యయనంలో గుర్తించిన జన్యువులపై మరిన్ని పరిశోధనలు జరపడం, వీర్యంపై యోగా ప్రభావంపై విస్తృత అధ్యయనం ద్వారా వంధ్యత్వ సమస్యలను అధిగమించేందుకు మెరుగైన మార్గం లభిస్తుందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. యోగా అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇద్దరు ఏడాది తిరగకుండానే తండ్రులు అవుతుండటం విశేషం.

See Also | ఏపీలో మరో 4 కొత్త ఓడరేవులు