139మంది అత్యాచారం కేసు.. డాలర్ భాయ్ కోసం పోలీసుల వేట, ఆఫీసులో అమ్మాయిల సర్టిఫికెట్లు, ఆడియో టేపులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న యువతిపై 139 మంది అత్యాచారం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని సోమాజీగూడ దగ్గరున్న అమృత విల్లేలో 304లో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న ఆఫీసుని పోలీసులు సీజ్ చేశారు. గాడ్ పవర్(God Power Foundation, Save The Humanity) పేరుతో స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన డాలర్ భాయ్, ఈ ఆఫీసులో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాలయ్ భాయ్ ఆఫీసులో పోలీసులు కొందరు అమ్మాయిల సర్టిఫికెట్లు గుర్తించారు. డాలయ్ భాయ్ ఆఫీసులోకి సరిఫికెట్లు ఎలా వచ్చాయో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. అలాగే డాలయ్ భాయ్ ఆఫీసులో పలు ఆడియో టేపులనూ పోలీసులు గుర్తించారు. డాలర్ భాయ్ పై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాలర్ భాయ్ ను పట్టుకునేందుకు పోలీసులు వేటను ముమ్మరం చేశారు.
స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన డాలర్ భాయ్:
అత్యాచారం కేసుని పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. నిజానిజాలు రాబట్టేందుకు విచారణ వేగవంతం చేశారు. బాధితురాలకి ఆశ్రయం ఇచ్చింది డాలర్ భాయే. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయించింది కూడా అతడే. ఈ కేసు విచారణలో డాలర్ భాయ్ కు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు డాలర్ భాయ్ ఎవరు? అతడికి సంబంధించిన ఆడియో టేపులు ఎందుకు సంచలనంగా మారాయి? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.