వృద్ధ దంపతుల మానవత్వం : ప్రభుత్వానికి విరాళంగా వృద్ధాశ్రమం 

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 03:41 AM IST
వృద్ధ దంపతుల మానవత్వం : ప్రభుత్వానికి విరాళంగా వృద్ధాశ్రమం 

హైదరాబాద్ : సాధారణంగా ప్రభుత్వం వృద్ధులకు ఫించన్ ఇస్తుంది. వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తుంది. వృద్ధులు ఇతరుల సహాయాన్ని కోరుతారు. అయితే వృద్ధ దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వానికే వృద్ధాశ్రమాన్ని విరాళంగా ఇచ్చారు వృద్ధ దంపతులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరులో నిర్మించిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి జానకమ్మ వానప్రస్థాశ్రమాన్ని ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతులు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ను గురువారం కలిసి పూర్తి వివరాలు అందించారు. ‘ఎకరంన్నర భూమిలో 6 వేల చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మిం చాం. అనారోగ్యం కారణంగా భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడంతో వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలి’ అని కోరారు.

ఈ అంశం పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో మాట్లాడతారని కేటీఆర్‌ చెప్పారు. వృద్ధ దంపతులు ప్రారంభించిన సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని దంపతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కేటీఆర్‌ మాట్లాడారు. వృద్ధ దంపతుల సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని కేటీఆర్‌ కొనియాడారు.