చెత్తకుప్పలో అంబేద్కర్ విగ్రహం : దళిత నేతల ఆందోళన

  • Published By: madhu ,Published On : April 14, 2019 / 01:44 AM IST
చెత్తకుప్పలో అంబేద్కర్ విగ్రహం : దళిత నేతల ఆందోళన

Updated On : April 14, 2019 / 1:44 AM IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అపచారం జరిగింది. విగ్రహం తరలింపుపై GHMCపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధ్వసం చేయడమే కాకుండా చెత్త లారీలో డంపింగ్ యార్డుకు తరలించారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతుండగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

నగరంలోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ..విగ్రహాన్ని GHMC సిబ్బంది తరలించే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తరలించే సమయంలో విగ్రహం విరిగిపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇది జరిగిందని ప్రజా సంఘాల నేతలు విమర్శించాయి. విగ్రహ తరలింపు వివాదంపై తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్..జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్‌లను వివరణ కోరారు. 

ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం అంబేద్కర్‌ జయంతిని నిర్వహించేందుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో పంజాగుట్ట సర్కిల్‌లో శుక్రవారం రాత్రి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేశారంటూ GHMC పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం తెల్లవారుజామున విగ్రహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీనిని దళిత నేతలు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విగ్రహాలకు అనుమతులున్నాయా ? అని నేతలు ప్రశ్నించారు. 

విగ్రహం తరలించే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని నేతలు ఆరోపిస్తున్నారు. చెత్త లారీలో తరలించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద పలు సంఘాలు ధర్నా నిర్వహించాయి. చెత్తకుప్పలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని నేతలు బయటకు తీసి నీళ్లతో శుభ్రం చేశారు. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని తరలించే విధానం ఇదేనా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కనీస గౌరవం ఇవ్వకుండా ధ్వంసం చేయడమే కాకుండా చెత్తవేసే ప్రదేశంలో పడేయడం ఎంతవరకు సమంజసమని దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు.

దీనిపై GHMC కమిషనర్ స్పందించారు. అంబేద్కర్ విగ్రహం తరలింపు తీరు దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై IAS అధికారి నేతృత్వంలో అంతర్గత విచారణ కమిటీ వేసినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో భాధ్యులుగా తేలిన యూసుఫ్ గూడ చెత్త తరలింపు కేంద్ర ఆపరేటర్‌ను విధుల్లో నుండి తొలగించినట్లు తెలిపారు.