చారిత్రక కట్టడాల పరిరక్షణకు అమెరికా సాయం

హైదరాబాద్: నగరంలోని చారిత్రక ప్రదేశాలైన తారామతి, ప్రేమామతి సమాధుల పరిరక్షణకు అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. యూఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్(ఏఎఫ్‌సీపీ) కింద రూ.70 లక్షల ఆర్థికసాయం అందచేయటానికి సిధ్దంగా ఉన్నామని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ.జస్టర్ చెప్పారు. గురువారం ఆయన సమాధులను సందర్శించారు.
తారామతి, ప్రేమామతి సమాధుల వద్ద దెబ్బతిన్న భాగాలను పునర్నిర్మించేందుకు, వాటికి పూర్వపు రూపు తీసుకొచ్చేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన తెలిపారు. సమాధులపై ఉన్న సిమెంట్ పూతను తొలగించి ప్లాస్టర్‌తో తిరిగి పునర్నిర్మిస్తామని ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సీఈవో రాశిష్ నందా తెలిపారు. దేశవ్యాప్తంగా 2001 నుంచి అంబాసిడర్ల ఫండ్ నుంచి వెయ్యి ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందజేసినట్లు జస్టర్ తెలిపారు. కుతుబ్‌షాహీ సమాధులు, మౌలాలీలోని మహ్‌లేకా భాయ్ సమాధుల పరిరక్షణకు కూడా ఆర్థికసాయం అందజేశామన్నారు.