సమ్మె విరమించమని కార్మిక సంఘాలను ఆదేశించలేమన్న హైకోర్టు
సమ్మె విరమించమని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వివరాలు అన్ని తెలిసిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని కోర్టు సూచించింది.

సమ్మె విరమించమని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వివరాలు అన్ని తెలిసిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని కోర్టు సూచించింది.
సమ్మె విరమించమని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వివరాలు అన్ని తెలిసిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని కోర్టు సూచించింది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ ను శుక్రవారానికి వాయిదా వేసింది.మరోవైపు ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 30, 2019) సరూర్ నగర్ స్టేడియంలో ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరికి నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వరుసగా రెండోరోజూ విచారణ కొనసాగింది. ఆర్టీసీ బకాయిలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆర్టీసీ నేతలు చెప్తున్నట్లు ప్రభుత్వం బకాయి లేదని నివేదించింది. రీయింబర్స్‌మెంట్ బకాయిలు 1099 కోట్లు ఉన్నాయని చెప్పింది. కాగా… రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఇంత వరకూ ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని హైకోర్టు ప్రశ్నించింది. విభజన జరిగి ఐదేళ్లు గడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది. అయితే విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తుల వ్యవహారం తొమ్మిదో షెడ్యూల్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఏజీ.
ఆర్టీసీ సమ్మె కారణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ప్రయాణం చెయ్యాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం… విద్యార్థులు బస్సులు లేక ఇబ్బంది పడతారంటూ విద్యాసంస్థలకు సెలవులు ఎలా ప్రకటించారని నిలదీసింది. ఆర్టీసీ ఎండీ ఒక్కసారైనా కోర్టు హాజరయ్యారా అని ప్రశ్నించింది. కాగా… 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలపగా… ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మొత్తం ఆర్టీసీకి ఉన్న బస్సుల సంఖ్య గురించి తెలుసుకున్న హైకోర్ట్… ఇప్పుడు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా ప్రభుత్వంపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమకు సమర్పించే నివేదికలో బ్యూరోక్రాట్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమనలేదని… ఎంత బకాయి పడ్డారో అడిగామని గుర్తు చేసింది. ప్రభుత్వం 4253 కోట్లు ఇస్తే బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. ఆర్టీసీకి కేటాయించిన నిధుల్ని ఎలా కేటగిరీ చేశారన్న హైకోర్టు… బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డిఫాల్టర్ ప్రభుత్వమే కదా నిలదీసింది.
ఆర్టీసీకి 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కొంత గడువు ఇస్తే… సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తామని నివేదించింది. సర్కార్ సమాధానంపై ఆగ్రహించిన ధర్మాసనం… ఉప ఎన్నిక జరిగే చోట వంద కోట్ల వరాలు ఎలా ప్రకటించారంటూ సెటైర్లు వేసింది. ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గ ప్రజలు ముఖ్యమా? లేక.. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా అని నిలదీసింది. ప్రజల ఇబ్బందుల్ని తొలగించేందుకు ఆర్టీసీకి 47 కోట్లు ఇవ్వలేరా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది.