సంతకాలు ఫోర్జరీ : TV9 రవి ప్రకాష్‌పై కేసులు నమోదు

TV9 సీఈవో రవి ప్రకాష్‌పై తెలంగాణ సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బి, 90, 160, ఐటీ యాక్ట్ 66, 72 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నిధులను దారి మళ్లించడం, సంతకం ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లయింట్ ఆధారం సైబర్ క్రైం పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు TV9 ఆఫీసు, రవి ప్రకాష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంతకం ఫోర్జరీ జరగడం, నిధులను మళ్లించడంపై అలంద మీడియా యాజమాన్యం సీరియస్ అయ్యింది. రవి ప్రకాష్‌పై చర్యలు తీసుకుంది. టీవీ9 ఆఫీస్, రవిప్రకాష్ ఇంట్లో జరిపిన సోదాల్లో ఎలాంటి పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నది ఇంకా వెల్లడించలేదు పోలీసులు.
ఐపీసీ 160 ప్రకారం వెంటనే విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు పోలీసులు. టీవీ9 ఆఫీస్ నుంచి ఎలాంటి పత్రాలు తీసుకెళ్లారు, ఏయే వస్తువులను తరలించారనే విషయాలను వెల్లడించాలని కూడా ఆదేశించారు పోలీసులు.
టీవీ9 సంస్థలోని 91 శాతం వాటాను అలంద మీడియా కొనుగోలు చేసింది. 9 శాతం వాటా మాత్రమే రవి ప్రకాష్ దగ్గర ఉంది. యాజమాన్యం మారినప్పటి నుంచి టీవీ9.. తన నియంత్రణలోనే ఉండాలంటూ కొత్త యాజమాన్యాన్ని రవిప్రకాష్ ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ.. కొత్త డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారు రవి ప్రకాష్.
సంస్థ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా.