జంతుగణన పూర్తి

జంతువుల పరిరక్షణ కోసం నిర్వహించిన జంతుగణన ముగిసింది. మే 11వ తేదీన ఇది ప్రారంభమై మే 13తో ముగిసింది. ఫారెస్టు అధికారులు, ఎన్జీవోల సంయుక్త కృషితో ఇది సాధ్యమైంది. జంతువుల కదలికలు, అడవుల్లో నీటి చెలమల గుర్తింపు..అక్కడకు వచ్చే జంతువుల కదలికల ఆధారంగా సర్వే నిర్వహించారు. మొత్తం 104 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 43 బృందాలుగా విడిపోయారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ లైఫ్ డెక్కన్ బర్డర్స్, హిటికో్స్, ఎఫ్ డబ్ల్యూపీఎస్ తదితర సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.
మే 11వ తేదీ శనివారం అరణ్య భవన్ నుండి మూడు బస్సుల్లో బృందాలు బయలుదేరాయి. ప్రతి బృందానికి స్థానిక అటవీ శాఖ నుంచి ఒక గైడ్‌ను ఏర్పాటు చేశారు. అడవిలో వారి పర్యటన, రవాణా, వసతి తదితర వాటిని అటవీ శాఖ ఏర్పాటు చేసింది. అమ్రబాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు, కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఈ సర్వే నిర్వహించారు.
నీటి చెలమలు, వాగులు, నీటి వనరుల వద్ద వేటగాళ్లు బిగించిన ఉచ్చులను గుర్తించి వాటిని తొలగించారు. 241 నీటి వనరుల వద్ద ఉదయం..సాయంత్రం..రాత్రి పొద్దుపోయిన తర్వాత సందర్శనలు జరిపారు. చెలిమెలు, వాగుల వద్ద జంతువుల కాలిముద్రలను సేకరించారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టు ఫాంథర్, అడవి కుక్కలు, ఎలుగు, జింకలో ఒక రకాన్ని, నీల్ గాయ్, చౌసింగాలను నేరుగా తాము చూడడం జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఇక ఏటూరు నాగారంలో ఇండియన్ బైసల్, నీల్ గాయ్, పలు రకాల పాములు, పక్షులను చూసినట్లు తెలిపారు. వీరు ఇచ్చిన సర్వే రిపోర్టుకు అటవీశాఖ వద్దనున్న అదనపు సమాచారాన్ని జోడించి జంతుగణన పూర్తి చేయనున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు, స్వచ్చంద సంస్థలు, అటవీ శాఖ సిబ్బందిని ఫారెస్టు ఫోర్స్ మెడ్ పీకే జా అభినందించారు.