అవార్డుల పంట : ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు జాతీయ అవార్డులు దక్కాయి. తెలంగాణలో మిషన్ కాకతీయ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం అవార్డులు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు అందించడంలో ముఖ్య వనరుగా వున్నచెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. అన్నదాతల కోసం జరుగుతున్న ఈ బృహత్తర పథకం ఇప్పటికే అనేక అవార్డులను కైవసం చేసుకోగా కేంద్రం నుంచి మరో అవార్డును అందుకుంది. చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టిన తెలంగాణ నీటిపారుదల శాఖకు అవార్డు దక్కింది. ఢిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్‌లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వార్షికోత్సవం సందర్భంగా.. నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో అవార్డుల ప్రదానోత్సవం చేశారు. కేంద్రం మంత్రి ఆర్కేసింగ్ చేతుల మీదుగా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు లభించింది. కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవార్డును అందుకున్నారు.