టీకాల్లో మార్పులు : ‘టీటీ’కి బదులు ‘టీడీ’

ఢిల్లీ : వైద్య విధానంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కష్టతరమైన చికిత్సలను కూడా సులభతరంగా చేస్తున్నాయి. ఈ క్రమంలో మనకు ఇనుప ముక్కలతో గాయం అయితే వెంటనే డాక్టర్ వద్దకు వెళితే వెంటనే టీటీ (టెటనస్ టాక్సైడ్) ఇంజెక్షన్ చేస్తారు. ఎందుకంటే ధనుర్వాతం వంటివి రాకుండా..అలాగే ఏ గాయమైనా ముందుగా డాక్టర్ చేసేది టీటీనే. గాయపడినవారికి వాతం రాకుండా ముందు జాగ్రత్తగా ఈ టీటీని చేస్తారు. ఇకపై టీటీ కాదు మరొక మెడిసిన్ అందుబాటులోకి రానుంది. అదే ‘టీడీ’ (టెటనస్-డిఫ్తీరియా).
తెలంగాణలో రాబోయే జూన్ నుంచి ‘టీడీ’ టీకాను అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. దశలవారీగా కొత్త టీకాను అమలు చేయాల్సిందిగా ఢిల్లీలో అన్ని రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేయడంతో.. ఆ దిశగా అమలుకు తెలంగాణ వైద్యాధికారులు సంసిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి టీడీ టీకాలు సరఫరా కాలేదు. అయినప్పటికీ.. ఈ టీకాల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, నర్సులకు ముందస్తు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త టీకాను ఎప్పుడెప్పుడు..ఎవరెవరికి ఎలా?
- పిల్లలకు పదేళ్లు, 16 ఏళ్ల వయసు ఉన్నపుడు..
- మహిళ గర్భం దాల్చినట్లుగా కన్ఫామ్ అయిన తరువాత తొలి టీకా, నాలుగు వారాల తర్వాత మరొక టీకా.
టీకాల్లో మార్పులు ఎందుకు అవసరం?
- ధనుర్వాతం(టెటనస్), కంఠసర్పి(డిఫ్తీరియా) జబ్బుల నివారణ కోసం ప్రస్తుతం పెంటావాలెంట్ టీకాను ఇస్తున్నారు.
- కోరింత దగ్గు, హెపటైటిస్ బి, హీమోఫిలస్ ఇన్‌ఫ్లుయంజా టైప్ బి జబ్బులను నివారించే గుణాలూ ఈ టీకాలో ఉంటాయి.
- ప్రస్తుతం శిశువుకు 6, 10, 14 వారాల వయసులో పెంటావాలెంట్ టీకాను అవసరం.
- శిశువుకు 16-24 నెలల మధ్యలో డీపీటీ బూస్టర్ 1, ఐదేళ్ల వయసులో డీపీటీ బూస్టర్ 2 టీకాలు ఇవ్వాల్సి అవసరం ఉంటుంది.
- ప్రస్తుతం పిల్లలకు పదేళ్లు, 16 ఏళ్ల వయసు వచ్చేసరికి కేవలం టీటీ టీకాను మాత్రమే ఇస్తున్నారు.
- 10 ఏళ్ల వయసు అనంతరం కంఠసర్పి, కోరింత దగ్గు జబ్బులు రావడం తగ్గిపోవడంతో ఈ రెండింటికీ టీకాలు అవసరం ఉండటంలేదు.
- ఈ క్రమంలో గత కొంతకాలంగా కంఠసర్పి కేసులు మధ్యవయస్కుల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఫీవర్ ఆసుపత్రిలో ఏటా వందకు పైగా కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది.
- ప్రపంచవ్యాప్తంగా పదేళ్ల కిందటి నుంచే ధనుర్వాతం టీకాకు తోడుగా కంఠసర్పి టీకాను కూడా కలిపి ‘టీడీ’ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ అమల్లోకి తీసుకొచ్చింది.
- గర్భిణి దశలోనే ఈ టీడీ టీకాను రెండు మోతాదుల్లో ఇవ్వడంతో గర్భిణితో పాటు, పుట్టబోయే శిశువుకు కూడా ధనుర్వాతం, కంఠసర్పి జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- ఇప్పటికే దాదాపు 133 దేశాలు ‘టీటీ’ స్థానంలో ‘టీడీ’టీకానుఅమలు చేస్తున్నాయి.
- ప్రస్తుతం ‘టీటీ’ టీకా అమలుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని యునిసెఫ్ అందజేస్తోంది.
- ఈ క్రమంలో ఎక్కువ కాలం ‘టీటీ’ని కొనసాగించలేమనీ, ఇప్పటివరకూ అమలు చేయని అన్ని దేశాలూ 2020 జనవరి నాటికి కచ్చితంగా ‘టీడీ’ టీకాను అమలు చేయాల్సిందేననీ, లేదంటే ‘టీటీ’కిచ్చే ఆర్థికసాయాన్ని అందించలేమని యునిసెఫ్ స్పష్టం చేసింది.
- ‘టీటీ’కి బదులుగా ‘టీడీ’ టీకాను అమలుచేయడంలో అయ్యే ఖర్చును భరిస్తామని తేల్చిచెప్పింది.